సారొస్తున్నారు
eenadu telugu news
Updated : 02/08/2021 05:45 IST

సారొస్తున్నారు

నేడు హాలియాలో కేసీఆర్‌ పర్యటన

సాగర్‌ నియోజకవర్గ సమస్యలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, హాలియా

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతిని సమీక్షించడానికి సీఎం కేసీఆర్‌ సోమవారం హాలియాకు రానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి వాయుమార్గంలో హాలియాకు సీఎం చేరుకుంటారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్న వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వస్తారు. అనంతరం అక్కడ జిల్లా అధికారులతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గతంలో ఇచ్చిన హామీల పురోగతిపై సమీక్షిస్తారు. నెల్లికల్‌, ఇతర ఎత్తిపోతలు, ఏళ్లుగా నియోజకవర్గంలో తిష్ఠవేసిన సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్యే భగత్‌ నివాసంలో భోజనం చేసి వాయుమార్గంలోనే హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ పర్యటన ఖరారయ్యాక మూడు రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అధికారులంతా అక్కడే

హామీల అమలు, పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష నిర్వహించడానికి సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో మూడు రోజులుగా అధికార యంత్రాంగం సాగర్‌ నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జిల్లా ఉన్నతాధికారులు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, తహసీల్దార్లు అక్కడే మకాం వేసి నివేదికలను రూపొందిస్తున్నారు. ఎజెండా ఇప్పటికీ చేరకపోవడంతో సీఎం ఏ అంశంపై చర్చిస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ‘‘సారు వచ్చే షెడ్యూల్‌ మాత్రమే చెప్పారు. ఏ అంశం ప్రధాన ఎజెండానో మాకింక చెప్పలేదు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు తప్పితే ఏ అంశంపై ఆదేశాలుంటాయో తెలియని పరిస్థితి నెలకొంద’’ని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.


భారీ బందోబస్తు

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, డీఐజీ, నలుగురు ఐపీఎస్‌ స్థాయి అధికారులతో పాటు ఎనిమిది మంది అడిషనల్‌ ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 75 మంది సీఐలు, 300 మంది ఎస్సైలు, దాదాపు 2వేల మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. హాలియా నుంచి వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మళ్లిస్తారు. దేవరకొండ నుంచి మిర్యాలగూడ.. మల్లేపల్లి, నల్గొండ మీదుగా మాచర్ల, నాగార్జునసాగర్‌ వైపు వెళ్లే వాహనదారులు మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా చేరుకోవాలని పోలీసులు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని