ఆయకట్టులో జల సవ్వడి
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

ఆయకట్టులో జల సవ్వడి

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

పదకొండు లక్షల ఎకరాలకు 45 టీఎంసీలు అవసరమని అంచనా

గరిడేపల్లి, న్యూస్‌టుడే

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు

కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకులు ప్రణమిల్లు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరటంతో క్రస్ట్టుగేట్ల ద్వారా అధికారులు ఆదివారం దిగువకు నీటిని విడుదల చేశారు. 14 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. ఈ అందాలను తిలకించటానికి పర్యాటకులు తరలివచ్చారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లోలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

- నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే

సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఆరు లక్షలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అయిదు లక్షల ఎకరాలకు వానాకాలం పంట అవసరాలు తీరనున్నాయి. ఎగువ జలాశయాల నుంచి వస్తున్న భారీ వరద నేపథ్యంలో ఖరీఫ్‌ సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం అధికారులను ఆదేశించారు. ఆగమేఘాల మీద అధికారులు నీటి విడుదలకు సిద్ధమయ్యారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే నోముల భగత్‌ మధ్యాహ్నం 2.10 గంటలకు ఒక గేటును ఎత్తి 500 క్యూసెక్కులు వదిలారు. ఎడమ కాల్వ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఆయకట్టుకు 21 టీఎంసీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు 23 టీఎంసీలు అవసరమని అధికారులు తెలిపారు. 11 లక్షల ఎకరాలకు దాదాపు 45 టీఎంసీలు అవసరమవుతాయని అంచనా.

వారబందీ ప్రకారం..

గతంలో మాదిరిగానే వారబందీ ప్రకారం నీటిని విడుదల చేసే అవకాశముంది. ముందస్తుగా నీరు విడుదల చేసిన నెల పాటు నిరంతరాయంగా వదలనున్నారు. నాట్లు పూర్తయిన అనంతరం వారబందీ (ఆన్‌ఆఫ్‌ పద్ధతి) ప్రకారం నీటినివ్వనున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో దిగుబడులు పెరిగాయని, నీరు ఆదా అవుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంతో పాటు ప్రైవేట్‌ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో వానాకాలంలో 9 రోజులు నీటిని విడుదల చేసి 6 రోజులు నిలిపేశారు. ముందుగా మొదటి విడత 31 రోజులు నిరంతరాయంగా విడుదల చేయగా తర్వాత వారబందీ అమలుపరిచారు. వానాకాలంలో ఆగస్టు 8 నుంచి నవంబర్‌ 31 వరకు ఏడు విడతలుగా 85 రోజులు నీటిని విడుదల చేశారు. తాజాగా ఆదివారం 500 క్యూసెక్కులు విడుదల చేయగా క్రమేణా పెంచుతూ 9 వేల క్యూసెక్కులు వదలనున్నారు.

ఎక్కడి పనులు అక్కడే నిలిపివేత

నీరు విడుదల చేయడంతో ప్రధాన కాల్వ, మేజర్లపై జరుగుతున్న పనులు నిలిపేస్తున్నారు. మొదటి రెండ్రోజులు 500 క్యూసెక్కులు విడుదలవుతున్నందున మట్టి పనులు పూర్తిచేస్తామని ఎస్‌ఈ నర్సింహారావు వెల్లడించారు. జాతీయ రహదారి పనులను గుత్తేదారు ఆపేసి సరంజామా తరలించనున్నట్లు తెలిపారు.


రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎడమ కాల్వ నీటి విడుదలకు స్విచ్‌ ఆన్‌ చేస్తున్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌,

ఎమ్మెల్యే నోముల భగత్‌

నాగార్జునసాగర్‌: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. సాగర్‌ ఎడమ కాల్వకు ఆదివారం నీటిని విడుదల చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక అన్నదాతల అభ్యున్నతికి అనేక పథకాలకు రూపకల్పన జరిగిందన్నారు. ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి చుక్కను తప్పకుండా తీసుకొస్తామన్నారు. ఎన్నెస్పీ ఎస్‌ఈ ధర్మ, డీఈ పరమేశ్‌, ఏఈ కృష్ణయ్య, డ్యాం భద్రతాధికారి పవన్‌కుమార్‌, పెద్దవూర జడ్పీటీసీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, బ్రహ్మారెడ్డి, పాల్గొన్నారు.

ఏఎమ్మార్పీ ఆయకట్టుకు సైతం..

పెద్దఅడిశర్లపల్లి: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు ఆదివారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఎన్నెస్పీలో నీరు సమృద్ధిగా ఉండటంతో షెడ్యూలు కంటే తొమ్మిది రోజుల ముందే కోదండాపురం స్టేజీ వద్ద ప్రధాన కాల్వపై గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఉదయ సముద్రం వరకు 350 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఈ నీటిని సాగు, తాగు అవసరాలకు వినియోగించనున్నారు. ఆయకట్టులో నారుమళ్లు మాత్రమే ఉండటంతో తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. మూడు మోటార్లతో 1,800 క్యూసెక్కుల నీటిని పుట్టంగండి జలాశయంలోకి వదులుతున్నారు. అక్కంపల్లి జలాశయంలో నీటిమట్టం 243.5 ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చేరుకుంది. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని డీఈ నాగయ్య తెలిపారు.


నేడు ప్రణాళిక ఖరారు
ఎడమ కాల్వకు నీటి సరఫరాపై సోమవారం ప్రణాళిక ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్‌ పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయకట్టు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. నీటి అవసరాలు, ఆయకట్టు, గతంలో నీటి విడుదల షెడ్యూలు వివరాలు సిద్ధం చేసి సమీక్ష అనంతరం ఖరీఫ్‌ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తామని చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని