ప్రతిభకు పదును
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

ప్రతిభకు పదును

జిల్లాల్లో ఖేలో ఇండియా కేంద్రాలు

శాట్స్‌కు ప్రతిపాదనలు పంపిన ఉమ్మడి జిల్లా డీవైఎస్‌వోలు

నల్గొండ క్రీడావిభాగం, న్యూస్‌టుడే

కబడ్డీ శిక్షణలో క్రీడాకారులు

ఇటీవల ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేసి పలు పతకాలు సాధించడంతో ఇకపై క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రతిభ గల వారిని గుర్తించి వారిని అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారు చేసేందుకు ఖేలో ఇండియా ప్రాజెక్టులను దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ఒక్కో జిల్లాకు మూడేసి క్రీడాంశాలు కేటాయించి కేంద్రాల ఏర్పాటుకు చేయూత అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించి వారికి నిష్ణాతులైన క్రీడా శిక్షకుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీని ఏర్పాటు భావి క్రీడాకారులకు వరంగా మారనుంది.

ఏ క్రీడాంశాల్లో క్రీడాకారులకు పట్టుందో వాటికే తొలి ప్రాధాన్యమివ్వనుంది. ఆ ప్రాంతంలోనే కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించనుంది. అన్ని అర్హతలున్న సీనియర్‌ క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారికి ఒక్కో కేంద్రానికి ఏటా రూ.5లక్షలు, శిక్షకుల వేతనాల కోసం రూ.3 లక్షలు కేటాయించనుంది. క్రీడా సామగ్రి సమకూర్చనుంది. జిల్లాలో శిక్షకులు, కేంద్రాల ఏర్పాటుకు డీవైఎస్‌వో, రాష్ట్ర క్రీడా ప్రాదికారిక సంస్థ (శాట్స్‌) పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా...

* సూర్యాపేట జిల్లాలో మెరిట్‌గా ఉన్న అథ్లెటిక్స్‌తో పాటు కబడ్డీ 2 కేంద్రాల ఏర్పాటుకు అర్హత గల వారి డీవైఎస్‌వో అధికారుల ద్వారా శాట్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఫైల్‌ జిల్లా కలెక్టర్‌ వద్ద ఉన్నట్లు సమాచారం.

* భువనగిరి జిల్లాలో హాకీ, జుడో క్రీడా కేంద్రాల ఏర్పాటుకు అర్హత గల వారు డీవైఎస్‌వో అధికారుల ద్వారా శాట్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ రెండు క్రీడాంశాల్లో ఏదో ఒక కేంద్రానికి అనుమతి లభించినా జుడో, హాకీ క్రీడాభివృద్ధికి అడుగులు పడనున్నాయి.

* నల్గొండ జిల్లాలో పట్టున్న క్రీడాంశాలకే ప్రాధాన్యమిచ్చారు. హాకీ, ఫెన్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాంశాల్లో అర్హత గల వారు డీవైఎస్‌వో అధికారుల ద్వారా శాట్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మూడు క్రీడాంశాల్లో ఏ ఒక్క కేంద్రం ఏర్పాటైనా ఇక్కడి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

క్రీడాంశాలివే..

ఖేలో ఇండియా ప్రాజెక్ట్‌లో ఒలింపిక్స్‌ క్రీడల్లో గుర్తింపు ఉన్న 14 క్రీడాంశాలను చేర్చారు. ఇందులో విలువిద్య, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, ఫెన్సింగ్‌, హాకీ, జుడో, రోయింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిప్టింగ్‌, రెజ్లింగ్‌ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ఏడాదిలో మొత్తం 1000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

క్రీడాకారుల మంచి అవకాశం

- మక్బుల్‌ అహ్మద్‌, డీవైఎస్‌వో, నల్గొండ

కేంద్రం ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయనుండడం అభినందనీయం. ఈ కేంద్రాలు ఏర్పాటైతే ప్రతిభ గల క్రీడాకారులు ఎందరో వెలుగులోకి వచ్చే అవకాశముంది. నల్గొండ జిల్లానుంచి మూడు క్రీడాంశాలను దరఖాస్తు చేశాం. అందులో ఏ కేంద్రంకు పర్మిషన్‌ లభిస్తుందో వేచిచూడాలి. దేశంలో క్రీడల అభివృద్ధి జరిగితేనే క్రీడాకారులు ఒలింపిక్స్‌ వంటి క్రీడసంగ్రామంలో పతకాలుసాధించగలుగుతారు.

హాకీ కేంద్రం ఏర్పాటు కావాలి

- ఇమామ్‌ కరీం, హాకీ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి.

ఉమ్మడి జిల్లాలో హాకీ క్రీడకు ఎంతో ఆదరణ ఉంది. గతంలో ఎందరో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి గుర్తింపు పొందారు. హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నల్గొండ జిల్లాలో ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు కావాలి. తద్వారా ఎందరో ప్రతిభ గల క్రీడాకారులు అంతర్జాతీస్థాయిలో రాణించే అవకాశాలు ఉంటాయి.

ఎంతో ప్రయోజనం

- మురళి, హాకీ క్రీడాకారుడు, నల్గొండ

నాకు చిన్నప్పటి నుంచి హాకీ ఆటంటే ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆడి పలు పతకాలు, బహుమతులు సాధించా. నల్గొండలో ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటైతే మాలాంటి క్రీడాకారులకు మేలు జరుగుతుంది. సరైన శిక్షణతో ఆటను మెరుగుపర్చుకుని జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని