చెయ్యి తిరిగింది.. పని దొరికింది
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

చెయ్యి తిరిగింది.. పని దొరికింది

నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్న యువత

ఆధునిక డిజైనింగ్‌ రంగంలో రాణింపు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే


భువనగిరిలో తన బృందంతో పీవోపీ సీలింగ్‌ పనిచేస్తున్న కిరణ్‌

ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధిస్తే స్థానికంగానే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని రుజువు చేస్తున్నారు వీరు. నిర్మాణ రంగంలో ఆధునికీకరణతో ఇతర రాష్ట్రాల వారు వివిధ విభాగాల్లోని పనుల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుండగా మన రాష్ట్రానికి చెందిన యువత సైతం ఆయా పనుల్లో నైపుణ్యం సాధించి ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతోంది.

ఊపందుకున్న నిర్మాణ రంగం

పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, చౌటుప్పల్‌, కోదాడ, యాదగిరిగుట్టతో పాటు పలు పురపాలికలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో నిర్మాణ రంగం ఊపందుకొంది. భారీ సంఖ్యలో భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన అనేక మంది ఏదో పని చేస్తూ కనిపించేవారు. ప్రస్తుతం తాపీ పని, సెంట్రింగ్‌, మట్టి పని, ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, రాతిపరుపు (గ్రానైట్‌), టైల్స్‌, రంగాల్ల్లో మన వాళ్లూ రాణిస్తున్నారు. పడకగది, చిన్నారుల గదులు, హాలులో డిజైనింగ్‌ పెయింటింగ్‌లో సత్తా చాటుతున్నారు. భవనం అందంగా కనిపించేందుకు స్టీల్‌ సామగ్రితో డిజైనింగ్‌ చేయిస్తున్నారు. తాను గత పదేళ్లుగా స్టీల్‌ రెయిలింగ్‌ పనిలో ఉపాధి పొందుతున్నట్లు మచ్చ మధు తెలిపారు.

బృందంగా ఇతర రాష్ట్రాల్లోనూ పని

ఇళ్లు, దుకాణం, నిర్మాణమేదైనా పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌) సీలింగ్‌ లేనిదే ప్రస్తుతం నిర్మాణం పూర్తి కాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రంగంలోనూ మన వారు రాణిస్తున్నారు. పీవోపీ సీలింగ్‌ రంగంలో పన్నెండేళ్లుగా ఉపాధి పొందుతున్నట్లు మిర్యాలగూడకు చెందిన కిరణ్‌ చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ తన బృందంతో పనులు చేస్తుంటానని వెల్లడిస్తున్నారాయన.

కప్‌బోర్డు, గ్లాస్‌ వర్క్‌లోనూ..

భవనంలో కప్‌బోర్డ్‌ వర్క్‌ చేయాలంటే డెకోలం, ప్లైవుడ్‌ పని చేసే వారు కావాలి. ఇంటి నిర్మాణంలో ప్రస్తుతం దీనికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన వాసు, మాడుగుల శ్రవణ్‌లు ఇతర రాష్ట్రాల నుంచి పనివారిని తీసుకొచ్చి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనులు చేయిస్తుండగా.. ప్రస్తుతం మన దగ్గర ఉన్న కార్పెంటర్లు సైతం ఈ పనిలో సత్తా చాటుతున్నారని చెబుతున్నారు. ఇక గ్లాస్‌ వర్క్‌లో తమ కుటుంబం 20 ఏళ్లకు పైగానే పని చేస్తున్నట్లు శివకోటి భాను చెబుతున్నారు.


నైపుణ్యం సాధిస్తే మంచి భవిష్యత్తు

-వాసు, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కాంట్రాక్టర్‌, మిర్యాలగూడ

ప్రసుత్తం భవన నిర్మాణంలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పీవోపీ సీలింగ్‌, కబోర్డ్‌ వర్క్‌, గ్లాస్‌ డిజైనింగ్‌ ప్రధానమైనవి. గతంలో యూపీతో పాటు ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఈ పనులకు వచ్చేవారు కానీ.. ప్రస్తుతం మన దగ్గర యువత సైతం ఆయా పనుల్లో రాణిస్తున్నారు. స్థానిక యువత ఈ పనుల్లో మరింతగా నైపుణ్యం సాధిస్తే మంచి ఉపాధి, భవిష్యత్తు ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని