సరికొత్తగా.. వస్త్రధారణ
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

సరికొత్తగా.. వస్త్రధారణ

మహిళా కండక్టర్లకు మెరూన్‌ రంగు ఆఫ్రాన్‌

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

నూతన వస్త్రధారణలో మహిళా కండక్టరు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే మహిళా కండక్టర్లకు కొత్త డ్రెస్‌ కోడ్‌ ఆమల్లోకి వచ్చింది. సౌకర్యంగా ఉండేలా మెరూన్‌ రంగు ఆఫ్రాన్లను అందించారు.. ఒక్కొక్కరికి రెండు జతలు ఇచ్చారు. చుడీదార్‌ లేదా చీరపై ధరించడానికి అనుకూలంగా ఉండేలా వీటిని రూపొందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంది..

క్రమశిక్షణ.. గౌరవం

గతేడాది సీఎం సమక్షంలో ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగిన సమావేశంలో ఏక రూప దుస్తుల విషయమై చర్చ జరిగింది. మహిళా కండక్టర్లకు దుస్తుల విషయంలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. మొదట ఎరుపు రంగులోని ఆఫ్రాన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత మరో రంగును పరిశీలించారు. చివరగా మెరూన్‌ రంగు దుస్తులను ఎంపిక చేశారు. కొత్త డ్రెస్‌కోడ్‌తో మహిళా కండక్టర్లలో క్రమశిక్షణ మెరుగవడంతో పాటు సముచిత గౌరవం లభిస్తుందని ఆధికారులు భావిస్తున్నారు. బాటా కంపెనీ బూట్లు కూడా ఇచ్చారు.

ఉమ్మడి జిల్లాలో 310 మందికి..

ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడు బస్సు డిపోలు ఉన్నాయి. వీటిలో 310 మంది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. నెల క్రితమే జిల్లాలోని ఆన్ని డిపోల పరిధిలో నూతన వస్త్రం కండక్టర్లకు అందజేశారు. ఎవరికి వారు తమ సైజుకు తగ్గట్లు దుస్తులను కుట్టించుకున్నారు. కుట్టుకూలి ఉద్యోగినులకు త్వరలో ఇస్తామని నల్గొండ డిపో మేనేజర్‌ రామచంద్రమూర్తి తెలిపారు.

ప్రత్యేకంగా ఉంది... శ్రావణి కండక్టర్‌

ప్రతి శాఖలో వృత్తిని అనుసరించి ఆయా రంగుల దుస్తులు అందిస్తున్నారు. గతంలో ఖాకీ రంగు ఆఫ్రాన్‌ వేసుకున్నాం. ప్రస్తుతం ప్రత్యేకంగా కనిపించడం కోసం నూతన రంగు ఎంపిక బాగుంది..

అందరికీ పంపిణీ చేశాం.. : రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఎం, నల్గొండ రీజియన్‌

నల్గొండ రీజియన్‌ పరిధిలోని బస్సు డిపోల్లో పనిచేస్తున్న 310 మంది మహిళా కండక్టర్లకు మెరూన్‌ రంగు వస్త్రం, బూట్లు అందజేశాం. అందరూ వాటిని ఇప్పుడిప్పుడే ధరిస్తున్నారు. నూతన రంగు వస్త్రంతో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని