సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Updated : 20/09/2021 04:02 IST

సంక్షిప్త వార్తలు

శతాధిక వృద్ధురాలు కన్నుమూత

రామన్నపేట, న్యూస్‌టుడే: రామన్నపేటలో శతాధిక వృద్ధురాలు అయిటిపాముల నర్సమ్మ వయో భారంతో ఆదివారం మృతి చెందింది. ఈమెకు 85 సంవత్సరాల కుమార్తె భూలక్ష్మమ్మ అంత్యక్రియలు నిర్వహించింది. చేనేత పద్మశాలి సంఘం నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.


ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు

తండ్రి మృతి.. కొడుకుకు తీవ్ర గాయాలు

తుర్కపల్లి, న్యూస్‌టుడే: కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతిచెందగా.. కొడుకు తీవ్రంగా గాయపడిన ఘటన తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌ గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌తండాకు చెందిన బానోతు వినోద్‌ (28) తుర్కపల్లి మండలం ధర్మారంలోని అత్తగారి ఇంటికి వచ్చారు. సాయంత్రం తన ఎనిమిదేళ్ల కొడుకు వర్షిత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రుస్తాపూర్‌ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని భువనగిరి జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య రోజా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ మైసయ్య తెలిపారు.


రావిపహాడ్‌తండాలో విషాదఛాయలు

బీబీనగర్‌: వినోద్‌ మృతితో రావిపహాడ్‌తండాల విషాదఛాయలు అలముకున్నాయి. వినోద్‌ ఇళ్లలో గ్రానైట్‌, టైల్స్‌ పనులు చేస్తుంటారు. అతని భార్య రోజా తండాలో వీబీకేగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో భార్య కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులను చూసి వచ్చేందుకు ఆమెతోపాటు ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనంపై ధర్మారం తండాకు వెళ్లారు. తిరిగి చిన్న కుమారుడు వర్షిత్‌తో కలిసి వస్తుండగా కారు ఢీకొంది. ఇంతకు ముందే అంగవైకల్యంతో బాధపడుతున్న వర్షిత్‌ ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది. కుటుంబ పెద్దదిక్కు మృతిచెందాడని తెలియగానే ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. మృతుడి భార్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు.


భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

కోదాడ రూరల్‌, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడంలేదన్న మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో ఆదివారం జరిగింది. కోదాడ ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ అశోక్‌(40)కు అడ్లూరుకు చెందిన లక్ష్మీతో 13ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన అశోక్‌ ఇంటికివచ్చి భార్యతో గొడవపడుతుండటంతో విసిగిన భార్య లక్ష్మి మూడురోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అడ్లూరుకు వచ్చిన అశోక్‌ తన భార్యను పంపాలని అత్తింటివారితో వారించగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురై గ్రామశివారులో ఉన్న మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.


వ్యాపారానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం

బీబీనగర్‌: వ్యాపారం చేసేందుకు డబ్బులు అడిగితే తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం రాఘవాపురం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజ్‌గిరికి చెందిన కంకణాల వినీత్‌రెడ్డి (25)కు ఏడాది కిందట వివాహం జరిగింది. కొన్ని నెలలుగా తాను వ్యాపారం చేసుకుంటానని డబ్బులు ఇవ్వాలని తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని అడుగుతున్నారు. ఆదివారం ఉదయం వినీత్‌రెడ్డి డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఘట్కేసర్‌కు వచ్చి ఇంటికి ఫోన్‌చేసి తాను చనిపోతున్నట్లు తండ్రికి చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి వెంటనే సమీప బంధువుల సాయంతో బీబీనగర్‌లో ఉన్న బెండె ప్రవీణ్‌తో కలిసి వెతకడం ప్రారంభించారు. ఘట్కేసర్‌ చుట్టుపక్కల ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో బీబీనగర్‌ పోలీసుల సాయంతో చరవాణి సిగ్నల్‌ ఆధారంగా రాఘవాపురం శివారులో వినీత్‌ ఉన్నట్లు గుర్తించారు. చుట్టుపక్కల వెతకగా రాఘవాపురంలో శివారులోని ఓ వెంచర్‌ సమీపంలో పురుగు మందు తాగి మృతిచెంది ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.


రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

నకిరేకల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు నకిరేకల్‌ మండలం మంగళపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న దోరెపల్లి శివర్ధన్‌, అయితగోని శ్రావ్య, రాచమల్ల శ్రీలత నల్గొండలో జరిగిన ఉమ్మడి జిల్లా బాలబాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల ఎంపికల్లో ప్రతిభచూపారని పాఠశాల హెచ్‌ఎం ఎల్‌.సత్యనారాయణ, పీఈటీ చింతకాయల పుల్లయ్య ఆదివారం తెలిపారు. ఈ నెల 20 నుంచి 22 వరకు వరంగల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.


సాహిత్యాభివృద్ధికి కృషి

నీలగిరి, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్య అభివృద్ధి కోసం పెన్నా శివరామకృష్ణ కృషి చేస్తున్నారని సాహితీ వేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. లయన్స్‌క్లబ్‌ డైమండ్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన కాళోజీ అవార్డు గ్రహీత పెన్నా శివరామకృష్ణ అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. రచయితలు తనకు నచ్చిన రచనలు మాత్రమే చేస్తారు. అలా కాకుండా శివరామకృష్ణ అన్ని రకాల రచనలు చేశాడని గుర్తు చేశాడు. నేటి తరం రచయితలకు పెన్నా రచనలు మార్గం చూపుతాయని వివరించారు. కాళోజీ పురస్కారం అందుకున్న ఆయన్ను అభినందించారు. క్లబ్‌ రీజనల్‌ ఛైర్మన్‌ ఏదుళ్ల అంజిరెడ్డి, రచయితలు డాక్టర్‌ బెల్లి యాదయ్య, గుడిపాటి మునాస్‌ వెంకట్‌, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎల్కిట్టె శంకర్‌రావు, గోనారెడ్డి, డాక్టర్‌ పగడాల నాగేందర్‌ పాల్గొన్నారు.


ఆక్రమణల తొలగింపునకు చర్యలు

మిర్యాలగూడ: పాత బస్టాండ్‌లో దుకాణదారులు రోడ్డు ఆక్రమిస్తున్న వైనాన్ని ఈ నెల 18న ‘నడక దారి లేక నరకం’ శీర్షికతో ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఎస్పీ ఏ.వీ.రంగనాథ్‌ స్పందించి, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించినట్లు ట్రాఫిక్‌ ఎస్సై సర్దార్‌నాయక్‌ తెలిపారు. తక్షణమే నడకదారికి అడ్డంగా ఉన్న సామగ్రిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని