దాడి యత్నం హేయం
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

దాడి యత్నం హేయం

తెరాస నుంచి పడాల శ్రీనివాస్‌ సస్పెన్షన్‌

తుర్కపల్లి ఘటనపై ఎమ్మెల్యే సునీత చర్యలు

మాట్లాడుతున్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా తెరాస నుంచి తుర్కపల్లి మండల మాజీ అధ్యక్షుడు, మాజీ ఏఎంసీ పడాల శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రకటించారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరి వల్ల నియోజకవర్గంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. శనివారం తుర్కపల్లి మండల కమిటీ ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినప్పటికీ పడాల శ్రీనివాస్‌ అతని అనుచరులను ఉసిగొల్పి డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎన్నిక ఇన్‌ఛార్జిలపై దాడికి యత్నించడం దుర్మార్గమని, దీన్ని పార్టీ సహించదని మండిపడ్డారు. పడాల శ్రీనివాస్‌తోపాటు పడాల పెద్ద శ్రీనివాస్‌, తిర్మాలపురం గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్‌, నాయకులు సామల కరుణాకర్‌, ఇమ్మడి అనిల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెరాసలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ మండల, పట్టణ కమిటీలు ఎన్నిక జరిగిందని చెప్పారు. మోటకొండూర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాది క్రితం పడాల శ్రీనివాస్‌ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే క్షమించామని, పదవి ఉంటే ఒక రకంగా.. లేకుంటే మరోరకంగా వ్యవహరిస్తున్న తీరుకు వేటువేయక తప్పలేదని వివరించారు. అనంతరం పట్టణంలోని రహదారి విస్తరణ పనులు పరిశీలించారు. లక్ష్మీ టాకీస్‌ ఎదురుగా ఉన్న వీధి వరకు వంతెనను ముగించాలని గుత్తేదారుకు సూచించారు. ఆమె వెంట ఏఎంసీ ఛైర్మన్‌ గడ్డమీది రవీందర్‌ గౌడ్‌, పుర అధ్యక్షురాలు సుధ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌, నాయకులు పాపట్ల నరహరి, ముక్కెర్ల సతీశ్‌, కసావు శ్రీనివాస్‌, తాళ్లపల్లి నాగరాజు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని