అతి వేగం.. బతుకులు ఆగం
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

అతి వేగం.. బతుకులు ఆగం

కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద రెండు ప్రమాదాల్లో ఐదు ప్రాణాలు బలి

నాగర్‌కర్నూలు జిల్లాలో బస్సు, ఆటో ఢీకొని మిర్యాలగూడ ప్రాంత వాసులు ముగ్గురు దుర్మరణం


ముత్యాలమ్మగూడెం వద్ద ముగ్గురిని బలిగొన్న కారును క్రేన్‌ సాయంతో పక్కకు తప్పిస్తున్న దృశ్యం

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ‘వేగం కన్నా ప్రాణం మిన్న’ రహదారి భద్రతలో ప్రధాన సూత్రమిది. ఉరుకుల పరుగుల జీవనంలో దీనిని ఎవరూ పట్టించుకోనందున నినాదంగానే మిగిలింది. అధిక వేగం.. చోదకుల నిర్లక్ష్యం.. రహదారి విస్తరణ లోపాలతో 65వ నెంబర్‌ హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడుతూనే ఉంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని 2012లో నాలుగు వరుసలుగా విస్తరించారు. నాటి నుంచి వాహనాల మితిమీరిన వేగం, విస్తరణ లోపాలతో నిత్యం ఉమ్మడి జిల్లా పరిధిలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఆదివారం కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద వెంటవెంటనే జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ ఉండే రహదారుల్లో ఇది రెండోస్థానంలో, ప్రమాదాల్లో ఐదో స్థానంలో ఉంది. ఈ రహదారి విస్తరణ సమయంలో వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించే విధంగా డిజైన్‌చేశారు. కానీ రహదారి సామర్థ్యానికి వాహనాల వేగానికి పొంతన ఉండటం లేదు. అత్యాధునిక సాంకేతికతతో కొత్తకొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. వీటి వేగం కూడా అనూహ్యంగానే ఉంటుంది. గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈ రహదారిపై వాహనాలు ప్రయాణిస్తుండటం వల్ల రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేగ నియంత్రణ చర్యలు జాతీయ రహదారులపై నామమాత్రంగానే అమలువుతున్నాయి. స్పీడ్‌గన్‌ల వంటి ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా వాయువేగంతో ప్ర యాణించే వాహనాలు అధికంగా ఉంటున్నాయి.

ఒకదాని వెంటే మరోటి

ముత్యాలమ్మగూడెం వద్ద ఆదివారం లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అక్కడ పోలీసులు సహాయక చర్యలు చేపడుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాద స్థలికి 200 మీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. అందులో ఆగి ఉన్న ఓ లారీని వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు నడిపిన వ్యక్తి ఏమరుపాటుకు ఆయనతోపాటు పక్కన ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. విషాదంలో ఇది మరో విషాదం.


నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గోపాల్‌రెడ్డి, రచన మృతదేహాలను చూసి రోదిస్తున్న వారి బంధువులు

ఒంటరైన చిన్నారి

చీమకుర్తి: గోపాల్‌రెడ్డి, రచన దంపతుల మృతితో వారి స్వస్థలాల్లో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపరాజుపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం.వారికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గోపాల్‌ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నారు. ఒంగోలు కమ్మపాలెంకు చెందిన రచనను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. కుమార్తెతో హాయిగా జీవితం సాగుతున్న వేళ విధి వెంటాడింది. అటు తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారి ఒంటరైంది.


చికిత్స పొందుతున్న రియాన్షి

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..

మిర్యాలగూడ గ్రామీణం: దైవదర్శనానికి వెళ్లి మొక్కులు తీర్చుకుని వస్తుండగా జరిగిన ప్రమాదం మిర్యాలగూడ మండలం జటావత్‌తండా గ్రామంలో విషాదం నింపింది. నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో ఆదివారం బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆలయానికి వెళ్లిన కుటుంబంలోని ఇద్దరు, వారిని ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్‌ అసువులు బాశారు. పలువురు క్షతగాత్రులుగా మారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన చిత్రాలు వాట్పప్‌ ద్వారా చూసిన బంధుమిత్రులు ఆందోళన చెందారు. అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలివెళ్లారు. బంధువుల రోదనలతో గ్రామం విషణ్ణవదనంలో మునిగిపోయింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని