కత్తులతో బెదిరించి, నగదు, చరవాణి అపహరణ
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

కత్తులతో బెదిరించి, నగదు, చరవాణి అపహరణ

చిట్యాల, న్యూస్‌టుడే: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంలోని డ్రైవర్‌ను ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి చరవాణి, నగదును దొంగిలించిన ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని పడమటిలంక రాజ్యలక్ష్మినగర్‌కు చెందిన బత్తుల అరుణ్‌కుమార్‌ డీసీఎం డ్రైవర్‌. తన డీసీఎంను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బుధవారం రాత్రి వస్తుండగా పెద్దకాపర్తి దాటాక వాహనానికి మరమ్మతులు అవసరముండడంతో పెద్దమ్మ గుడి వద్ద రహదారి పక్కన ఆపి పడుకున్నారు. మంగళవారం ఉదయం మెకానిక్‌ కోసం ఎదురుచూస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో టీఎస్‌05 యూఈ 1724 నెంబరు గల ఆటోలో ముగ్గురు యువకులు వచ్చి అరుణ్‌కుమార్‌ను కత్తులతో బెదిరించి, అతని నుంచి చరవాణి, రూ.500 నగదును లాక్కుని ఆటోలో పారిపోతుండగా అరుణ్‌కుమార్‌ వారి వాహనాన్ని వెంబడించారు. ఆయన కేకలు విని సమీపంలో లారీ కార్మికులు వారి ఆటోను అడ్డగించబోగా వారిని కత్తులతో బెదిరించి పారిపోయారని ఎస్సై పేర్కొన్నారు. అరుణ్‌కుమార్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి, సీఐ శంకర్‌రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పోలీసుల అదుపులో ఇద్దరు ఆగంతకులు!

పెద్దకాపర్తి వద్ద డీసీఎం డ్రైవర్‌ను ముగ్గురు యువకులు కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడిన ఘటనలో ఇద్దరిని చిట్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీకి పాల్పడి పారిపోతుండగా పెద్దకాపర్తి శివారులో స్థానికులు అడ్డగించారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా కత్తులతో బెదిరించి ఒకరు పారిపోగా మిగలిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి నుంచి రెండు కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పెద్దకాపర్తి చోరీ ఘటన కన్నాముందు నార్కట్‌పల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనకు వారు పాల్పడినట్లు తెలిసింది. చోరీకి పాల్పడిన ఆగంతకులు నల్గొండ, పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని