పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్లు
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్లు

భువనగిరి: రైతుబజార్‌లోని నిర్మాణాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నల్లమాస రమేష్‌, డీఎంవో సబిత

గుండాల, న్యూస్‌టుడే: తహసీల్‌ కార్యాలయాల్లో నిర్వహించే భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తహసీల్దార్లకు ఆదేశించారు. మంగళవారం గుండాల తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకొని సమయానికి రాని కారణంగా భూ రిజిస్ట్రేషన్‌ ఆగిపోవడం వంటి సమస్యలు వచ్చినప్పుడు స్లాట్‌ బుకింగ్‌ రద్దు గురించి వివరించాలని ఆయన సూచించారు. జిల్లాలోని నూతనంగా ఏర్పాటైన 33 గ్రామ పంచాయితీల్లో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తికి వీఆర్వోలు కృషి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి పట్టణం: రైతుబజార్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనులను మంగళవారం అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. రూ.41 లక్షలతో ఇక్కడ పలు నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నిర్మాణాల పూర్తయిన వెంటనే రైతుబజార్‌ను ఇక్కడికి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నల్లమాస రమేష్‌, డీఎంవో సబిత, మార్కెట్‌ కార్యదర్శి అంజిత్‌రావు, పర్యవేక్షకులు మనీష్‌, అయూబ్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

పరిహారం అందిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: దుకాణానికి దుకాణం, ఇంటి స్థలానికి స్థలం, నిర్మాణానికి రెండింతల పరిహారం అందించిన తర్వాతే తమ గృహాలను స్వాధీనం చేసుకోవాలని, అంతవరకు ఇవ్వమని యాదగిరిగుట్ట ప్రధాన రహదారి విస్తరణ బాధితులు స్పష్టం చేశారు. పట్టణంలో రెండో దశగా పాతగుట్ట చౌరస్తా నుంచి సన్నిధి హోటల్‌ వరకు చేపట్టనున్న రహదారి విస్తరణకు బాధితులతో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఆర్డీవో సూరజ్‌కుమార్‌ మంగళవారం ఎంపీడీవో సమావేశ మందిరంలో చర్చలు జరిపారు. పూర్తిగా పరిహారం అందక మా కంటే ముందున్న బాధితులు ఇబ్బందులు పడుతున్నారని, మాకు ఆ పరిస్థితి రావొద్దని వేడుకొన్నారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో తహసీల్దారు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని