ఆసుపత్రికెళ్తే జేబు గుల్లే
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

ఆసుపత్రికెళ్తే జేబు గుల్లే

డెంగీ పేరిట అధిక బిల్లుల వసూలు

ప్లేట్‌లెట్లు తగ్గాయని అనడంతో బెంబేలెత్తుతున్న సామాన్యులు

నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన విక్రాంత్‌ (23)కు వారం క్రితం డెంగీ జ్వరం రావడంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో పరీక్షలు చేయగా ప్లేట్‌లెట్ల సంఖ్య 1.05 లక్షలుగా ఉందని, ఇదీ ప్రమాదకర పరిస్థితి అంటూ ఐసీయూలో చేర్చాలని, అందుకు రూ. 40 వేలు కట్టాలని చెప్పడంతో విక్రాంత్‌ తల్లిదండ్రులు ఆశ్చర్చపోయారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని బతిమిలాడి చివరకు రూ.25 వేలు కట్టారు. రెండ్రోజులు ఐసీయూలో చికిత్స చేసిన దవాఖానా యాజమాన్యం ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగిందని విక్రాంత్‌ను ఇంటికి పంపించింది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.40 వేలు బిల్లు వేశారని బాధితుడు వాపోయారు.

సూర్యాపేట జిల్లా కుడకుడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి మనోహర్‌ కూతురు (12)కు ఇటీవల డెంగీ రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు అంతా సవ్యంగానే ఉందని చెప్పిన సదరు యాజమాన్యం తీరా ప్లేట్‌లెట్ల సంఖ్య 80 వేలకు పడిపోయిందని, ఐసీయూ చికిత్సకు రూ. 35 వేలు కట్టాలని లేకుంటే రోగిని హైదరాబాద్‌కు తీసుకుపోవాలని అనడంతో తన భార్య నగలు అమ్మి రూ.20 వేలు కట్టగా మూడు రోజుల పాటు ఐసీయూలో చికిత్స చేసిన ఆసుపత్రి నిర్వాహకులు అనంతరం ఆమెను డిశ్ఛార్జి చేశారు.

ఈనాడు, నల్గొండ: ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఉమ్మడి జిల్లాలో క్రమంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా ఆసుపత్రిలో చేరిన బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులు బిల్లుల పేరుతో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా లేకపోయినా, ఐసీయూలో చికిత్స చేయాలని చెప్పి రూ.వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఇదంతా తెలిసినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రులతో ఉన్న ‘ఒప్పందం’తో ఈ వ్యవహారంపై స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. మూడు జిల్లాల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో ఇటీవల డెంగీ కేసులు పెరిగాయి. సాధారణంగా ఆరోగ్యవంతుడి శరీరంలో ప్లేట్‌లేట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుందని వైద్యులు వెల్లడిస్తుండగా, డెంగీ సోకితే ఇవి కనిష్ఠ స్థాయికి పడిపోతాయి. ఈ స్థాయి 50 వేల కంటే దిగువకు పడిపోతే రోగి పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉన్నట్లే లెక్క. అయితే 60 వేలు, 70 వేలు ఉండగానే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నల్గొండ, సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రు (జీజీహెచ్‌)ల్లో రక్తం నుంచి ప్లేట్‌లెట్లను విడగొట్టే పరికరాలున్నాయి. ప్రైవేటు కన్నా సర్కారు దవాఖానాల్లోనే మెరుగైన పరికరాలు, చికిత్స అందుతున్నా కొంత మంది సర్కారు వైద్యుల సిఫారసు మేరకే జీజీహెచ్‌లకు వచ్చిన వారు ప్రైవేటులోకి వెళుతున్నారని తెలిసింది. ఇలా నల్గొండ, సూర్యాపేటల్లో పలువురు వైద్యులు జీజీహెచ్‌లకు వైద్యం కోసం వచ్చినవారిని బెదరగొట్టి తమకు తెలిసిన ప్రైవేటు ఆసుపత్రి ఉందని, ఫీజు కూడా తక్కువ తీసుకుంటారని చెప్పి వారిని అక్కడకి పంపిస్తున్నారు. తీరా ఒక్కసారి దవాఖానాలో చేరిన తర్వాత అడ్డగోలుగా పరీక్షలు చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు. నల్గొండ జీజీహెచ్‌కు ఎదురుగా ఉన్న ఓ పరీక్షల కేంద్రం (డయాగ్నోస్టిక్‌ సెంటర్‌) నెలకు రూ.లక్షల్లో ప్రభుత్వ వైద్యులకు ‘సిఫారసు ఫీజు’ చెల్లిస్తున్నట్లు సమాచారం. పట్టణంలో ఎక్కడ పరీక్షలు చేయాలన్న వైద్యులు అక్కడకే సిఫారసు చేస్తారు. దీంతో అతికొద్ది కాలంలోనే సదరు పరీక్షల కేంద్రం నిర్వాహకుడు రూ.కోట్లకు అధిపతి అయ్యారు. త్వరలోనే మరో పరీక్షల కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అనవసరంగా ఎక్కిస్తే దుష్ప్రభావం

- డాక్టర్‌ మాతృ, జనరల్‌ ఫిజిషీయన్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, నల్గొండ జిల్లా

డెంగీలో రోగికి అవసరం లేకపోయినా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే అది దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. డెంగీ జ్వరం సాధారణ ఔషధాల ద్వారానే మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది. లక్షలోపు తగ్గితే రోగి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. 50 వేల కంటే దిగువకు పడిపోతే అది ప్రమాదకర స్థాయి. 80 శాతం రోగులకు వచ్చిన డెంగీ జ్వరం సాధారణమైందే.

ఫిర్యాదు చేస్తే, ఆసుపత్రిని సీజ్‌ చేస్తాం

- ఎ.కొండల్‌రావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి, నల్గొండ

జిల్లాలో ఎక్కడా డెంగీకి ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షల కేంద్రాలు లేవు. రోగులు గమనించి సర్కారు దవాఖానాల్లో చికిత్స చేసుకోవాలి. ఇక్కడా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. డెంగీ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే స్థానిక వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ఫీజు వసూలు నిజమని తేలితే సదరు ఆసుపత్రిని సీజ్‌ చేస్తాం.

ఈ ఏడాది సెప్టెంబరు 20 వరకు నమోదైన డెంగీ కేసులు

సూర్యాపేట 156

నల్గొండ 35

యాదాద్రి 8


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని