నష్టపరిహారం పంపిణీ త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

నష్టపరిహారం పంపిణీ త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: డిండి ఎత్తిపోతల పథకం, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లు, కెనాల్‌ల భూ నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న శివన్నగూడెం, కిష్టరాయిపల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టు, చింతపల్లి, సింగరాజుపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లు, డిండి మెయిన్‌ె కనాల్‌ల కారణంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగం చేయాలని ఆదేశించారు. ఉదయసముద్రం పెండ్లిపాకల, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కోరారు. గొట్టిముక్కల ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులు వేగవంతం చేయాలన్నారు. కిష్టరాయిన్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఏర్పాటుకు భూమి గురించి నివేదిక సమర్పించాలని తెలిపారు. శివన్నగూడెం భూసేకరణ త్వరగా పూర్తిచేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఆనంద్‌, డీఆర్‌వో జగదీశ్వర్‌రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఆర్‌డీవోలు, స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు కృతజ్ఞతలు

నాంపల్లి: నాంపల్లి మండలంలోని వడ్డెపల్లిలో జామ్‌సింగ్‌ బాలాజీ వెంకటేశ్వరస్వామికి చెందిన 354.31 ఎకరాల భూమికి కొందరు పొందిన అక్రమ పట్టాలు రద్దు చేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రైబస మండల సమన్వయకర్త ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి మంగళవారం జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వందల ఎకరాల భూమి అక్రమార్కులకు చెందకుండా చేసినందుకు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. వారి వెంట మర్రిగూడ జడ్పీటీసీ సభ్యులు పాశం సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని