చదువులు సాగేదెలా..
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

చదువులు సాగేదెలా..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరి ఉన్నతంగా చదువుకోవాలని అనుకున్న విద్యార్థుల ఆశలు నెరవేరేవిధంగా కనపడడం లేదు. ఉమ్మడి జిల్లాలో జూనియర్‌ కళాశాలల పరిస్థితి పేరు గొప్ఫ. ఊరు దిబ్బలా తయారైంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఏ కళాశాలలో సరిపడా అధ్యాపకులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రతి కళాశాలలో ప్రవేశాల శాతం పెరిగినా... అందుకు సరిపడా అధ్యాపకులు కరవయ్యారు. ఉన్న నామమాత్రపు రెగ్యులర్‌ అధ్యాపకులు, కాంట్రాక్ట్‌ అధ్యాపకులతోనే విద్యార్థులకు పాఠాలు బోధింపచేస్తూ కాలం గడిపిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడంతో పరిస్థితి మరి దయనీయంగా మారింది. మరోవైపు కళాశాలల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఇవేం చదువులు రా బాబోయ్‌ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ప్రవేశాలు

ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాల శాతం పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ తదితర ప్రాంతాల్లోని ప్రతి కళాశాలల్లో ఇప్పటికే 90 శాతం మేర సీట్ల భర్తీ జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రైవేటులో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకే ఇష్టపడ్డారు. తీరా ఇక్కడి చేరాక చూస్తే అధ్యాపకుల కొరతతో తరగతులు సక్రమంగా కాక ఇబ్బందులు పడుతున్నారు. పాఠాలు కావడం లేదని చాలా మంది విద్యార్థులు కళాశాలలకు సైతం రావడం లేదు. పూర్తిస్థాయి అధ్యాపకుల భర్తీ జరిగితే తప్పా ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల బాధలు తప్పేలా లేవు.

అతిథి అధ్యాపకులు లేరు

తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అతిథి అధ్యాపకులను ప్రభుత్వం నియమించలేదు. అందుకు సంబంధించిన నియామకాలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనపడడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లాలో 60, యాదాద్రి భువనగిరి జిల్లాలో 81, సూర్యాపేట జిల్లాలో 45 అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిని ప్రస్తుతం నియమిస్తే విద్యార్థులకు కొంతమేరకైనా లబ్ధి చేకూరే అవకాశముంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ప్రభుత్వ కళాశాలల్లో సరిపడా రెగ్యులర్‌, అతిథి అధ్యాపకులు లేకపోవడంతో ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అతిథి అధ్యాపకులు ఉండడం వల్ల అన్ని సబ్జెక్టుల తరగుతులు క్రమం తప్పకుండా జరిగేవి. ప్రస్తుతం ఆ పరస్థితులు లేవు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో చాలా మంది రెగ్యులర్‌ లెక్చరర్లు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందడంతో ఆ పోస్టులు సైతం ఖాళీగా మారాయి. దీంతో విద్యార్థుల పాఠాల బోధనకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.

చాలా కళాశాలల్లో సౌకర్యాలు కరవు

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఫర్నిచర్‌, తాగునీరు, మూత్రశాలలు, పక్కా భవనాలు, ప్రయోగశాలలు, తరగతి గదుల కొరత, క్రీడా సదుపాయాలు కరవయ్యాయి. విద్యార్థుల సంఖ్య పెరిగినా... సౌకర్యాలు మెరుగుపడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన పట్టణాల్లోని కళాశాలల్లో సౌకర్యాలు కొంతవరకు బాగున్నా...మండల కేంద్రాల్లోని కళాశాలల్లో సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి పర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

హాస్టల్స్‌ తెరవక కష్టాలు...

సెప్టెంబర్‌ 1 నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 50శాతం మంది విద్యార్థులు నిత్యం తరగతులకు హాజరవుతున్నారు. హాస్టల్స్‌ తెరవకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు హాస్టల్స్‌ ప్రారంభించలేదని కళాశాలలకు రావడం లేదు. హాస్టల్స్‌ తెరిస్తే కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది.

తక్షణమే నియమించాలి: దస్రునాయక్‌, డీఐఈవో, నల్గొండ

ఉమ్మడి జిల్లాలోని ప్రతి కళాశాలలో పూర్తిస్థాయి తరగతులు కొనసాగాలంటే ప్రభుత్వం అతిథి అధ్యాపకులను తక్షణమే నియమించాలి. ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల శాతం పెరిగింది. అందుకనుగుణంగా అధ్యాపకులను నియమించి సౌకర్యాలు మెరుగుపర్చాలి.

సౌకర్యాలు కల్పించాలి

నితిన్‌, ద్వితీయ సంవత్సర విద్యార్థి

నేను నల్గొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది అతిథి అధ్యాపకుల లేక పాఠాలు సరిగ్గా కావడం లేదు. అతిథి అధ్యాపకులను నియమంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని