వేర్వేరు కేసుల్లో 11 మంది అరెస్టు
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

వేర్వేరు కేసుల్లో 11 మంది అరెస్టు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: గంజాయి, మత్తుమందుల విక్రయం, నకిలీ పురుగుమందు తయారీ, మత్తుకు బానిస చేసే మాత్రల విక్రయం కేసుల్లో 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం కేసుల వివరాలు విలేకరులకు చెప్పారు. సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీష్‌ చోడగిరి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, మిర్యాలగూడ రూరల్‌ సీఐ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రౌతు గోపి, ఎస్సై విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎస్పీ తెలిపిన వివరాలిలా..

నకిలీ గుళికల తయారీ

వాడపల్లి కేంద్రంగా నకిలీ పురుగుమందు గుళికలు (గ్రాన్యూల్స్‌) తయారు చేస్తున్న ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.19 లక్షల విలువ చేసే 38 టన్నుల నకిలీ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 200 లీటర్ల డీఎంఎఫ్‌ లిక్విడ్‌, సింథటిక్‌ రంగు బస్తాలు, రెండు తూకం యంత్రాలు, బస్తాలు కుట్టే మిషన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కర్టాటకలోని రాయచూరు జిల్లా సింథనూరుకు చెందిన యేలూరి శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని సంజయ్‌ ఇన్‌శక్తిసైడ్‌ కంపెనీలో పనిచేసే విజయ్‌శేఖర్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పంటల్లో తెగుళ్ల నిర్మూలనకు వాడే గుళికలకు నకిలీవి తయారు చేస్తున్నారు. వాడపల్లి వద్ద చిన్న గుళికరాళ్లు (చిప్స్‌) అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. దాచెపల్లి కూలీలతో ముగ్గు పేరిట గుళిక రాళ్లకు డీఎంఎఫ్‌ లిక్విడ్‌ కలిపి 25 కిలోల బస్తాల్లో నింపి హైదరాబాద్‌లో మూతబడిన సంజయ్‌ ఇన్‌శక్తిసైడ్‌, మరో కంపెనీకి తరలిస్తున్నారు. అక్కడ 5 కిలోల ప్యాకెట్లుగా తయారు చేసి రైతులకు అమ్మకానికి సిద్ధం చేసుకున్నారు. ఒక్క ప్యాకెట్‌ ఎకరాకు సరిపోతుంది. విశ్వసనీయ సమాచారంతో వ్యాపారం గుట్టు రట్టు చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి విక్రయాల కేసులో..

నల్గొండ నేరవిభాగం: మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి రవాణా, విక్రయాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హెదరాబాద్‌ కొత్తపేటకు చెందిన పోతుగంటి అనిల్‌కుమార్‌, హయత్‌నగర్‌కు చెందిన ఉతాది జ్ఞానేశ్వర్‌ మిర్యాలగూడలో ఉంటున్న సైదిరెడ్డికి మంగళవారం గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారి నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాథ్‌, వేమ జాన్‌రెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుంచి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మత్తుమందు విక్రేతల పట్టివేత

నల్గొండ నేరవిభాగం: మత్తు కోసం సిగరెట్‌లోని పొగాకులో కలుపుకొని పొగతాగే విడాయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వైజాగ్‌ అరకు ప్రాంతానికి చెందిన కిల్లో సురేష్‌, నల్గొండకు చెంది హైదరాబాద్‌లో స్థిరపడ్డ షేక్‌ మహబూబ్‌అలీ స్నేహితులు. వీరు గంజాయితో తయారు చేసిన విడాయిల్‌ను విక్రయిస్తున్నారు. మంగళవారం అరకు నుంచి సురేష్‌ విడాయిల్‌ను హైదరాబాద్‌ తరలించడానికి ప్రయత్నిస్తుండగా నిమజ్జనం సందర్భంగా పోలీసు గస్తీ ఎక్కువగా కనిపించింది. దీంతో షేక్‌ మహబూబ్‌ నల్గొండకు వచ్చి సరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వన్‌టౌన్‌ పరిధికి చెందిన షేక్‌ మహబూబ్‌అలీ దందా స్థానికుల ద్వారా తెలవడంతో వన్‌టౌన్‌ సీఐ బాలగోపాల్‌ మంగళవారం వారిని దేవరకొండ రోడ్డులో పట్టుకున్నారు. కిలో విడాయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. 20 కిలోల గంజాయి నుంచి కిలో విడాయిల్‌ తయారవుతుందని వారు తెలిపారు.

వైద్యుల అనుమతి లేకుండా నొప్పుల మాత్రల విక్రయం

నల్గొండ నేరవిభాగం: నల్గొండ ప్రకాశంబజార్‌లోని రాజా మెడికల్‌ హాల్లో వైద్యుల అనుమతి లేకుండా నొప్పుల మాత్రల విక్రయిస్తున్న దుకాణదారు జనార్దన్‌, వాటికి బానిసైన శాంతినగర్‌కు చెందిన గౌస్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నొప్పుల మాత్రలు అధిక మొత్తంలో వాడితే మత్తు వస్తుందని, దీనికి కొందరు బానిసలుగా మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ మాత్రలు వాడి ఓ వ్యక్తి మానసిక రోగిగా మారినట్లు తెలిపారు. యువత ఇలాంటి మాత్రలకు అలవాటు పడి మత్తుకు బానిసలుగా మారుతున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని