మాత్రలు వేసుకుంటేనే మనుగడ
eenadu telugu news
Published : 23/09/2021 05:53 IST

మాత్రలు వేసుకుంటేనే మనుగడ

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న యువతి

చండూరు, నల్గొండ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చండూరుకు చెందిన దోనాల గాయత్రి (21) రెండు మూత్రపిండాలు పాడైపోయాయి. నిత్యం రూ.వందలు విలువ చేసే పదుల సంఖ్యలో మాత్రలు మింగితే గాని ఆమె సాధారణ స్థితిలో ఉండదు. ఎనిమిదేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూనే ఇటీవల డిగ్రీ పూర్తి చేశారు. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పటంతో అందుకు ఆర్థిక స్తోమత సరిపోక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఔషధాల ద్వారానే ఆమె బతికించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత నెలకు రూ.15 వేలు విలువ చేసే మందులు వేసుకుంటూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. తండ్రి భూపాల్‌రెడ్డి పాల వ్యాపారం చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి చిన్న కూతురు కావటంతో పసిప్రాయం నుంచి అల్లారు ముద్దుగా చూసుకున్నారు. యుక్త వయస్సులోకి రాగానే ఆ కుటుంబాన్ని కిడ్నీల వ్యాధి రూపంలో కష్టాలు కబళించి వారి ముఖాల్లోని ఆనందం దూరం చేసింది. కూతురు చికిత్స కోసం ఇప్పటికే మాకున్న మూడెకరాల పొలం అమ్ముకున్నామని,. ప్రస్తుతం ఇల్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టామని, అయినా కూతురును ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు ‘న్యూస్‌టుడే’ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు.. చికిత్స నిమిత్తం తిరగని ఊరు లేదు, వెళ్లని ఆస్పత్రి లేదన్నారు. ఒక్క రోజు మందులు ఆపినా కూతురు ముఖం మొత్తం వాపు వచ్చి కంటి చూపు చూడలేని స్థితిలోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, నిత్యం ఔషధాలకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదని చెప్పారు. దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

దాతలు సంప్రదించాల్సిన ఈనాడు - హెల్ప్‌లైన్‌ నంబర్‌  96764 88878


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని