రెవెన్యూ ఉద్యోగులే సూత్రధారులు
eenadu telugu news
Published : 15/10/2021 05:39 IST

రెవెన్యూ ఉద్యోగులే సూత్రధారులు

రైతుబంధు సొమ్ము స్వాహా కేసు ఛేదించిన పోలీసులు

23 మంది రిమాండ్‌

కుంభకోణంపై ‘ఈనాడు’ ప్రచురించిన కథనాలు ‘ఈనాడు’ ఆనాడే చెప్పింది

గుర్రంపోడు, న్యూస్‌టుడే

నాంపల్లి ఎస్బీఐలో రైతుబంధు చెక్కులు పక్కదారి పట్టిన వైనాన్ని ‘ఈనాడు’ ఆనాడే వెలుగులోకి తెచ్చింది. అధికారులకు అంతుచిక్కని చెక్కుల వ్యవహారంలో ‘ఈనాడు’ ప్రచురించిన కథనాల్లో వ్యక్తపరిచిన సందేహాలు నేడు వాస్తవరూపం దాల్చాయి. దర్యాప్తు అధికారులు సైతం కథనాలను పరిశీలించినట్లు సమాచారం. అధికారుల వద్ద ఉన్న చెక్కులను ఏతరహాలో డ్రా చేశారో ముందుగానే పసిగట్టిన ‘ఈనాడు’ ఆ కోణంలో వాస్తవాలను ప్రచురించింది. ‘ఈనాడు’ కథనాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు అంతుచ్చిక్కని ప్రశ్న లకు సమాధానాలను ఒక్కొక్కటిగా పరిశోధించారు.

రాష్ట్రంలోనే 2018 సంవత్సరంలో సంచలనం సృష్టించిన రైతుబంధు చెక్కుల మాయం కేసులో ప్రధాన సూత్రధారులుగా రెవెన్యూ యంత్రాంగం పాత్ర తేటతెల్లమైంది. రైతులకు చెక్కులు అందజేయాల్సిన బాధ్యత కలిగిన వారే స్వాహా పర్వంలో సూత్రధారులు కావటం, వారిచుట్టూ తిరిగే పైరవీకారులు పాత్రధారులుగా రుజువైంది. రైతులకు అందచేయటానికి వీలుకాని, తిరిగి వెనక్కి పంపాల్సిన చెక్కులను బ్యాంకుల్లో మార్చి నిధులు స్వాహా చేసింది వారేనన్న వాదనలు పోలీసుల దర్యాప్తులో వాస్తవాలుగా కళ్లకు కడుతున్నాయి. తమకు అందాల్సిన రైతుబంధు చెక్కులు రాలేదని అందోళన చెందిన రైతులకు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. కేసు నమోదై మూడేళ్లు గడిచినా, కేసు ఆనవాళ్లు కనుమరుగైనా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చి పెద్ద కుంభకోణం గుట్టు రట్టు చేసినందుకు రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. .

12 మంది రెవెన్యూ వారే..

రైతుబంధు చెక్కుల మాయం కేసులో పోలీసులు 23 మందిపై కేసు నమోదు చేయగా అందులో 13 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 12 మంది రెవెన్యూ శాఖ వారే కావటం గమనార్హం. 2018లో రెవెన్యూ అధికారులకు అందిన చెక్కుల్లో రైతులకు నేరుగా పంచారు. కాగా, అందుబాటులో లేని రైతులు, మృతిచెందినవారి పేరిట అందిన చెక్కులు, వివాదాల్లో ఉన్న భూములకు వచ్చిన చెక్కులు రెవెన్యూ వారి వద్దే ఉండిపోయాయి. వాటినే బ్యాంకు ఉద్యోగి సహకారంతో మార్చుకుని స్వాహా చేశారు. మొత్తం 23 మందిలో 12 మంది పైరవీకారులుగా ఉన్న మధ్యవర్తులు కాగా, ఒక డిప్యూటీ తహసీల్దార్‌, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు వీఆర్వోలు, నలుగురు వీఆర్‌ఏలు, ఒక బ్యాంకు ఉద్యోగి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిర్ధరణకు వచ్చిన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీరేకాక మరికొందరు సూత్రధారులు కూడా ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. మొత్తం 547 చెక్కులకు రూ.61,50,460 పక్కదారి పట్టినట్లుగా తేల్చారు. నాంపల్ల్లి మండలంలో 332 చెక్కులు (రూ.38.06 లక్షలు), గుర్రంపోడు మండలంలో 139 చెక్కులు (రూ14.02లక్షలు), చండూరు మండలంలో 7 చెక్కులు (రూ.1.80లక్షలు), పీఏపల్లి మండలంలో 49 చెక్కులు (రూ.3.77లక్షలు), చింతపల్లి మండలంలో 20చెక్కులు (రూ.3.84లక్షలు) స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించి ఆధారాలు సేకరించి నిందితులపై ఛార్జీషీటు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు.

సూత్రధారులు తప్పించుకున్నారా..?

సుమారుగా మూడేళ్లపాటు పెండింగులో ఉన్నందున ప్రధాన సూత్రధారులు తప్పించుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెక్కుల స్వాహా పర్వం కేసులో సూత్రధారులు అయినప్పటికీ అందులో తమ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్న కొందరు రెవెన్యూ అధికారులు పోలీసుల విచారణ నుంచి సులభంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పైగా 2019లోనే కేసును పూర్తిగా విచారణ జరిపి ఉంటే వారంతా పట్టుబడి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మండలస్థాయిలో ప్రధాన అధికారికి తెలియకుండా చెక్కులు ఎలా మాయం అవుతాయని, ప్రతిమండలంలో అలా ప్రధాన రెవెన్యూ ఉద్యోగి పాత్ర ఉన్నప్పటికీ వారు బయటికి కనిపించకుండా ఆధారాలేవీ దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. గుర్రంపోడు మండలంలో ఒక అధికారి, నాంపల్లి మండలానికి చెందిన ఓ అధికారి పలు జాగ్రత్తలు తీసుకుని పోలీసుల దృష్టి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.

రికవరీ అయ్యేనా..?

చెక్కులను బ్యాంకుల్లో మార్చిన సొమ్మును కాజేసిన వారి వివరాలు వెలుగు చూసినా స్వాహా అయిన సొమ్ము రికవరీపై అనుమానాలు వీడటంలేదు. స్వాహా చేసిన నిందితులు ఖర్చు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మరికొంతకాలానికైనా చెక్కుల రూపంలో నగదు నష్టపోయిన రైతులకు దక్కాల్సిన డబ్బు దక్కుతుందా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిధులు స్వాహా అయి దాదాపు మూడేళ్లు కావటంతో నిందితుల వద్ద డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని