అదిగదిగో నవవైకుంఠం
eenadu telugu news
Published : 19/10/2021 04:50 IST

అదిగదిగో నవవైకుంఠం

 పూర్తి కావొచ్చిన ఆలయాల పునర్‌ నిర్మాణాలు

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌ రాక

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే

ఆలయం చెంత పసిడి వర్ణంలో మందిరంలా ఏర్పాటైన దర్శన వరుసలు

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన సమయం ఆసన్నమైంది. వైష్ణవ పీఠాధిపతి చిన్నజీయర్‌స్వామిని ఇటీవల సీఎం కేసీఆర్‌ కలిసి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పనుల పరిశీలనకు 16వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్‌ మంగళవారం వస్తున్నారు. జూన్‌ 21న సందర్శించాక ముమ్మరంగా సాగిన పనులతో కొండపై హరిహరుల ఆలయాల పునర్‌ నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ప్రధాన ఆలయమైన పంచ నారసింహుల సన్నిధిలో ఉత్తర దిశలో గ్రీనరీ, వైష్ణవ చిహ్నాలతో కూడిన లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవ రథశాలకు హంగులన్నీ పూర్తి చేశారు. రథశాలకు షట్టరు, కలశాలు బిగింపు పూర్తిచేశారు.

*   ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్‌లో యంత్రాలు బిగించారు. హరేరామ - హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయపాత్ర పర్యవేక్షణలో  ఇటీవలే ట్రయల్‌ రన్‌ చేశారు. విక్రయ కౌంటర్లు ఏర్పాటవుతున్నాయి.
*  దైవ దర్శనాలకు నాలుగు వేల మంది భక్తులు వేచి ఉండేలా నాలుగు అంతస్తుల సముదాయాన్ని విస్తరించి, ఉత్తర దిశలో మందిరం ఆకార హంగులతో తీర్చిదిద్దే పనులు వేగవంతం చేశారు. ఎస్కలేటర్ల బిగింపు పనులు పూర్తికావొచ్చాయి.
*   ఆలయం మాడ వీధిలో స్వర్ణ వర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసల పనులు పూర్తి చేశారు.
*   శివాలయం ప్రహరీ ఎత్తును తగ్గించి దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం వొంకుల లైటింగ్‌ ఏర్పాట్లయ్యాయి. స్వాగత తోరణం, రథశాల నిర్మించారు.
*   విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. బస్‌బే కోసం బండ తొలగింపుతో పాటు చదును పనులు కొనసాగుతున్నాయి.
* కొండపై ఉత్తర దిశలో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. బస్‌బే, మినీ పార్కింగ్‌ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశారు.
*  కృష్ణ శిలతో రూపొందించిన ఆలయ ప్రాంగణం, రాజగోపురాలతో సహా మండప ప్రాకారాలు, సహజత్వానికి అనుగుణంగా సాదృశ్యమయ్యేలా లైటింగ్‌ ఏర్పాట్లు అయ్యాయి.
*  వీఐపీల కోసం ఏర్పాటైన లిఫ్ట్‌ పనులతో పాటు దాన్ని మందిర రూపంగా తీర్చిదిద్దారు.

యాదాద్రి క్షేత్రం

గండి చెరువు పరిసరాల్లో..
*  క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా కొండకింద గండి చెరువు పరిసరాల్లో లక్ష్మీ పుష్కరిణి పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఇటీవల నీటిని నింపి ట్రయల్‌ రన్‌ చేశారు.
*  దీక్షా భక్తుల బస మండప భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయి.
*   కల్యాణకట్ట నిర్మాణం పూర్తికావొచ్చింది. ఆర్నమెంటల్‌ పనులు జరుగుతున్నాయి.
*   శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మండపం నిర్మాణంలో పునాదుల పనులు జరుగుతున్నాయి.

యాదాద్రీశుడి ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నరసింహారెడ్డి

ఆహ్లాదానికి..
యాత్రికులకు భక్తితో పాటు మానసిన ఆహ్లాదం కలిగించేలా పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ దారితో పాటు పరిసరాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనులు జోరందుకున్నాయి. గండి చెరువును రూ.40 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు కొనసాగిస్తున్నారు.

ఏర్పాట్ల హడావుడి
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో హడావుడిగా సోమవారం ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ పారిశుద్ధ్యం కార్మికులు గండిచెరువు, పట్టణ ప్రధాన పరిసరాల్లోని దారుల్లో మట్టిని తొలగించి ఊడ్చే పనులు చేపట్టారు. కనుమదారుల్లో ఇరువైపులా మొక్కలు నాటారు. కొండ కింద పెద్దగుట్టపై ఆలయ నగరి ప్రాంగణంలో నిర్మితమైన హెలిప్యాడ్‌ను తీర్చిదిద్దే పనులను చేపట్టారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్తు కాంతులు విరజిమ్మే లైటింగ్‌ ఏర్పాట్లను సోమవారం రాత్రి ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి పునఃపరిశీలించారు. ఆర్డీవో భూపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని