కారెక్కిన మోత్కుపల్లి
eenadu telugu news
Published : 19/10/2021 05:06 IST

కారెక్కిన మోత్కుపల్లి

తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్‌ వేదికపై మోత్కుపల్లి నర్సింహులు, మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఉమ్మడి జిల్లా తెరాస ఎమ్మెల్యేలు, నేతలు

భువనగిరి, ఆలేరు, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచి నేరుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న మాజీ మంత్రి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మళ్లీ రాజకీయ మహర్దశ చేకూరనుంది. 38 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకుని, సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో మోత్కుపల్లి సేవలను వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోత్కుపల్లి చేరికకు పచ్చజెండా ఊపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తెరాస ముఖ్య ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నాకనే పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తెరాస మరింత బలోపేతం కానుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

తరలిన అనుచరులు
మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరిక సందర్బంగా ఆలేరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, అనుచరులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో యువకులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. బాణసంచాను కాల్చారు. మోత్కుపల్లి చేరికతో నియోజవకర్గం మరింత అభివృద్ధి పథంలో సాగనుందని ఆయన అనుచరులు అభిప్రాయ పడుతున్నారు.

అమరవీరులకు నివాళి
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌, బషీర్‌బాగ్‌ కూడలిలోని బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి ఇతర నాయకులు ఉన్నారు. అనంతరం ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిన మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు.

- న్యూస్‌టుడే, నారాయణగూడ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని