ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్‌
eenadu telugu news
Published : 19/10/2021 05:06 IST

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్‌

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇంటర్‌ పరీక్షలపై అధికారులతో సమీక్షిస్తున్న అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) డి.శ్రీనివాస్‌రెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్‌ హైపవర్‌ కమిటీ అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈనెల 25 నుంచి నవంబర్‌ 2 వరకు జరిగే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జిల్లాలో మొత్తం 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 7,523 మంది విద్యార్థులు హాజరవుతారని కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించాలని, పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్‌ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. మంచినీటి వసతి కల్పించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణను రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ఇంటర్‌ పరీక్షల నోడల్‌ అధికారి బి.సంజీవ, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, సీఐ జానయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, మోత్కూర్‌ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ అవిలయ్య, పోచంపల్లి జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌ అరుంధతి పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని