క్యాంపు కార్యాలయం అందుబాటులోకి వచ్చేనా?
eenadu telugu news
Published : 19/10/2021 05:38 IST

క్యాంపు కార్యాలయం అందుబాటులోకి వచ్చేనా?

మునుగోడులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం చుట్టూ పెరిగిన కంపచెట్లు, పిచ్చి మొక్కలు

మునుగోడు, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం ఏర్పాటు చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కావాల్సిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించింది. ఆ కోవలో మునుగోడులో ఎమ్మెల్యే క్యాంపు భవనం నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆ భవనం సదుద్దేశం నెరవేరడం లేదు. 

ఇదీ పరిస్థితి...
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చండూరుకు వెళ్లే మార్గంలో ఎకరం స్థలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం రూ. కోటి నిధులను మంజూరు చేశారు. 2017 మే మాసంలో అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతులు మీదుగా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నత్తనడకన సాగిన పనులు ఆ తర్వాత సకల వసతులతో ఎనిమిది నెలల కిందట పూర్తి చేశారు. కానీ నేటికీ ఆ భవనం అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు నిరాశతో ఎదురు చూస్తున్నారు.

నెలలు గడుస్తున్నా..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే ఆ భవనం చుట్టూ కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి. ఇలాగే వదిలేస్తే పూర్తిగా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు ప్రధాన ముఖ ద్వారం వద్ద గేటు ఏర్పాటు చేసి ఆ భవనంలోకి ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.


ప్రహరీ నిర్మాణానికి చర్యలు
కాజన్‌గౌడ్‌, డీఈఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, మునుగోడు

మాకు అప్పగించిన 600 గజాల స్థలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని పూర్తి చేయించాం. ఎకరం స్థలం అప్పగించిన వెంటనే క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.  


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని