వెయ్యి కిలోలకు పైగా గంజాయి స్వాధీనం!
eenadu telugu news
Published : 19/10/2021 05:51 IST

వెయ్యి కిలోలకు పైగా గంజాయి స్వాధీనం!

తిరిగొచ్చిన పోలీసు బృందాలు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా నుంచి విశాఖ మన్యం ప్రాంతానికి వెళ్లిన 17 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తిరిగి వచ్చినట్లు సమాచారం. అరకు, వైజాగ్‌ ప్రాంతాల్లో మూడు రోజులకు పైగా నిర్వహించిన సోదాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాకు వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో సోమవారం ఎస్పీ ఏవీ రంగనాథ్‌ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకున్నారు. స్మగ్లర్ల దాడిని ఎదుర్కొన్న సిబ్బందితో పాటు టాస్క్‌లో కీలక పాత్ర పోషించిన వారిని అభినందించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్‌ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. దీని కోసం నెల రోజులుగా నిత్యం జాతీయ, రాష్ట్ర రహదారులపై అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నెల రోజుల్లో 35 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వేల కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ నుంచి ఉమ్మడి జిల్లా మీదుగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర భారత్‌కు  గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున  సరఫరా జరుగుతోంది. లంబసింగి ప్రాంతంలో గంజాయి అమ్మకందారులను ఆదివారం పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా నకిరేకల్‌ సీఐ, టాస్క్‌ఫోర్స్‌ సీఐల బృందంపై 20 మంది స్మగ్లర్లు రాళ్లు విసిరి దాడులకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పోలీస్‌ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోయినా పోలీస్‌ వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.


నడిగూడెంలో...


నడిగూడెంలో నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న మునగాల సీఐ ఆంజనేయులు

నడిగూడెం, : అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన సోమవారం నడిగూడెంలో జరిగింది. మునగాల సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్దల్‌పూర్‌కు చెందిన దేవరాజు గంజాయిని బస్సులో రవాణా చేస్తున్నాడు. మార్గమధ్యలో సూర్యాపేటలో పోలీసులు చేస్తున్నారని సమాచారం తెలుసుకుని మునగాలలో బస్సు దిగి నడుచుకుంటూ నడిగూడెం పెట్రోల్‌ బంకు వద్దకు రాగా అందిన సమాచారం మేరకు ఎస్సై ఏడుకొండలు సిబ్బంది నిందితుడిని పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.


గిరిజనుడిని విడిచిపెట్టిన  పోలీసులు
చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గంజాయి కేసుతో సంబంధముందని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న విశాఖ జిల్లా అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో భీమరాజును సోమవారం విడిచిపెట్టారు. ఈనెల 15న నల్గొండ పోలీసులు గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో బాలకృష్ణ, పనసలపాడుకి చెందిన నార లోవరాజుతో పాటు కిల్లో భీమరాజును అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు తమ అదుపులో ఉంచి విచారించిన అనంతరం ఆయన్ను విడిచిపెట్టారు. అన్నవరం ఎస్సై ప్రశాంత్‌కుమార్‌ భీమరాజును గాలిపాడుకు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. గ్రామానికి వచ్చి ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకోవడం, ఆదివారం పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు గాయాలపాలవడంతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని