పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
eenadu telugu news
Published : 19/10/2021 05:51 IST

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

కావటి తిరుపతయ్య

చందంపేట, న్యూస్‌టుడే: అప్పుల బాధతో పురుగు మందు తాగిన ఓ రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పోలేపల్లికి చెందిన కావటి తిరుపతయ్య(42) తనకున్న వ్యవసాయ చేనులో అప్పుచేసి మూడెకరాల్లో పత్తి సాగుచేశారు. ఆశించిన మేర పత్తి దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఈ నెల 17న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. తిరుపతయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. దీనికి సంబంధించి తమకు సోమవారం రాత్రి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై సందీప్‌ తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో భార్య మృతి; భర్తకు స్వల్ప గాయాలు
వేములపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలైన ఘటన వేములపల్లి మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అల్వలపాడ్‌కు చెందిన ఇస్లావత్‌ శ్రీను, భార్య నీల(38) ఆలేరులోని గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న కూతురు అనూషను బస్సు ఎక్కించేందుకు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై నల్గొండకు బయలుదేరారు. నల్గొండలో అనూషను బస్సు ఎక్కించి దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన నీల తలపై నుంచి ట్యాంకర్‌ వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీను తలకు శిరస్త్రాణం ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రొహిబిషన్‌ ఎస్సై రేణుక ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


ఉరేసుకొని యువకుడి బలవన్మరణం
కోదాడ రూరల్‌, న్యూస్‌టుడే: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోదాడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్‌ కాలనీకి చెందిన కొత్తూరి నరేంద్ర(26) తండ్రి కొన్నినెలల క్రితం మృతిచెందాడు. తల్లి అనారోగ్యం పాలుకావడంతో నరేంద్రకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికవిచారణలో తేలిందని ఏఎస్సై సైదా తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని