పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస నేతల దోపిడీ
eenadu telugu news
Published : 19/10/2021 06:03 IST

పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస నేతల దోపిడీ

నేరేడుచర్లలో నిర్వహించిన భారీ ఊరేగింపులో అభివాదం చేస్తున్న ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడితే తెరాస ప్రభుత్వం వారి ఆశలు అడియాశలు చేసిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నేరేడుచర్లలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని కమిటీ నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. తెరాస పాలనలో ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పోలీసులని అడ్డుపెట్టుకుని తెరాస దొంగలముఠా లాండ్‌, స్యాండ్‌, మైన్స్‌, వైన్స్‌ ఇలా అన్నింటిలోను దోపిడీకి పాల్పడుతోందన్నారు. డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి, ఎత్తిపోతల పథకాలు, విద్యుత్‌ ఉపకేంద్రాలు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్‌ పాలనలోనే చేశామన్నారు. తెరాస కనీసం రహదారులపై గుంతలు పూడ్చే పరిస్థితి  లేదన్నారు. మూసీనదిపై చెక్‌డ్యామ్‌ల విషయంలో రైతుల అభ్యంతరాలు పట్టించుకోకుండా కమీషన్ల కోసమే స్థలం మార్చారన్నారు. తాను మంచి పేరు తెచ్చుకోవడానికే ప్రయత్నించానన్నారు. దోచుకోవడం, దాచుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.కాంగ్రెస్‌ శ్రేణులు ధైర్యంగా ఉండి అరాచకశక్తులను తరిమి కొట్టాలన్నారు. పోలీసులు ఉద్యోగ ధర్మం మరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అన్ని పంచాయతీల్లో తాను పర్యటిస్తానన్నారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, అనురాధ, నిజాముద్దీన్‌, ఎరగాని నాగన్న, నవీన్‌నాయక్‌, భూక్యా గోపాల్‌ , మంజూనాయక్‌, కొణతం చిన్నవెంకటరెడ్డి, సుబ్బారావు, పైడిమర్రి రంగనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని