తుది మెరుగులు వేగిరం
eenadu telugu news
Updated : 24/10/2021 05:33 IST

తుది మెరుగులు వేగిరం

యాదాద్రిలో లక్ష్మీ పుష్కరిణి ప్రహరీపై ఐరావతాలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: మహా దివ్యంగా రూపుదిద్దుకున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వానికి ముందస్తుగా భక్తులకు అవసరమయ్యే వనరుల కల్పన పూర్తిపై యాడా ప్రత్యేక దృష్టి సారించింది. కొండ కింద గండి చెరువు చెంత నిర్మిస్తున్న లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట సముదాయాలు పూర్తి కావొచ్చాయి. వాటికి తుది మెరుగులు దిద్దే పనుల్లో భాగంగా రంగులు వేస్తున్నారు.

స్వామి సన్నిధిలో విస్తరణ పనులు.. క్షేత్రంలో విస్తరణ పనులను వేగవంతం చేశారు. గత మంగళవారం క్షేత్ర సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు నడుంబిగించారు. ఆశ్రమంలో కొండపైన ఉత్తర దిశలో బస్‌బే, మినీ పార్కింగ్‌ కోసం బండ రాళ్లను తొలగించి చదును చేస్తున్నారు. పాత కనుమదారి విస్తరణ ముమ్మరంగా సాగుతోంది. ఇక బాలాలయం చెంత దర్శనాల వరుసలను కొన్నింటిని తొలగించి ఆ ప్రాంగణాన్ని విస్తరించే పర్వం మొదలుపెట్టారు.

పెంబర్తిలో సిద్ధమవుతున్న ఇత్తడి నగిషీలను పరిశీలిస్తున్న ఈవో గీత

* సీఎం కేసీఆర్‌ సలహాతో పెంబర్తి కళాకారులతో ఇత్తడి కవచాలు, ద్వారాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఇత్తడి నగిషీలను ఆలయ ఈవో గీత శనివారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈవో వెంట ఆలయ సివిల్‌ విభాగం ఈఈ దయాకర్‌రెడ్డి ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని