రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

గుర్తుతెలియని వ్యక్తి..

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సీతారాంపురం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొనడంతో అతడి తల భాగం చిద్రమైంది. మృతదేహాన్ని జనరల్‌ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో ఉంచినట్లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు 94407 95658 చరవాణి సంప్రదించాలని కోరారు.


కల్వర్టును ఢీకొట్టి...

అజీజ్‌ పాష

నల్గొండ నేరవిభాగం: నల్గొండ మండలం దండెంపల్లి ప్రాంతంలో రోడ్డు వెంట కల్వర్టును ఢీ కొట్టి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆర్జాల బాయి ప్రాంతానికి చెందిన షేక్‌ అజీజ్‌ పాష (28) శనివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై కట్టంగూరు వెళ్తుండగా దండెంపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి తండ్రి షేక్‌ మహమూద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.


విధులకు వెళ్తుండగా లారీ ఢీకొని హోంగార్డు...

గడ్డం సాంభయ్య

కొండమల్లేపల్లి: హోంగార్డు విధులకు హాజరు కావడానికి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరిన ఐదు నిమిషాలకే రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతలపహాడ్‌ స్టేజీ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొలుముంతలపహాడ్‌కు చెందిన గడ్డం సాంభయ్య (42).. దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్‌ షిఫ్ట్‌ డ్యూటీ కావడంతో శనివారం రాత్రి 10.55 గంటలకు విధులకు హాజరవడానికి తన ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. ఐదునిమిషాల వ్యవధిలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో సాంభయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.


గేదె తాడు కాళ్లకు చుట్టుకొని.. వృద్ధుడు నీటమునిగి...

నర్సింహారావు

డిండి, న్యూస్‌టుడే: గేదెకు కట్టిన తాడు కాళ్లకు చుట్టుకున్న క్రమంలో గేదె బావిలోని నీటిలోకి ఈడ్చుకెళ్లింది. దీంతో నీటిలో మునిగిపోయిన ఓ వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన డిండి మండలంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని జేత్యతండాకు చెందిన పులిగిళ్ల నర్సింహారావు(70) వ్యవసాయం చేస్తుండేవారు. శనివారం ఉదయం గేదె బావి వద్ద ఓ మేకును పాతి తాడుతో కట్టివేసి ఇంటికొచ్చారు. మధ్యాహ్నం తర్వాత గేదెను ఇంటికి తోలుకొద్దామని వెళ్లారు. తాడు ఇప్పేక్రమంలో అప్పటికే ఎండతీవ్రతకు అలిసిన గేదె నర్సింహారావు చుట్టూ పరుగు తీసింది. దీంతో గేదె తాడు అతడి కాళ్లకు అల్లుకుని బిగుసుకుంది. ఎండ నుంచి ఉపశమనం కోసం పక్కనే ఉన్న బావిలోని నీటిలోకి గేదె పరుగు తీయడంతో నర్సింహారావు సైతం కాళ్లకు తాడు చుట్టుకుని ఉన్న కారణంగా కదళ్లేని స్థితిలో బావిలోకి వెళ్లాడు. పొలంలో ఉన్న అతడి కుమార్తె జ్యోతి గమనించి కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి నర్సింహారావును బయటకు తీయగా అప్పటికే మృతిచెందారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం

వడ్డె వెంకన్న

కేతేపల్లి, న్యూస్‌టుడే: పంట పెట్టుబడులకోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు బలవన్మరణం పొందిన ఘటన కేతేపల్లి మండలం చీకటిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చీకటిగూడేనికి చెందిన వడ్డె వెంకన్న(45) తనకున్న మూడెకరాలతోపాటు మరో ఏడెనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాకపోవడం, గిట్టుబాటు ధరలేకపోవడంతో పంట పెట్టుబడులకు పెట్టిన అప్పులు అధికమయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేక మానసికంగా కుమిలిపోయి శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెరాస మండల అధ్యక్షుడు మారం వెంకటరెడ్డి, చీకటిగూడెం సర్పంచి కోట వెంకటేశ్వర్‌రావు, తదితరులు సంతాపం తెలిపారు.

రైలు కింద పడి విద్యార్థి ... నల్గొండ నేరవిభాగం: జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి శనివారం ఉదయం గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వే ఇన్‌ఛార్జి ఎస్‌హెచ్‌వో కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. గొల్లగూడకు చెందిన గోగికార్‌ నవీన్‌కుమార్‌(19)కు ఇటీవల హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో ఉచితంగా బీటెక్‌ సీటు వచ్చింది. అక్కడ చదవడం ఇష్టం లేక నల్గొండలోనే చదువుతానని చెప్పారు. కానీ తల్లిదండ్రులు బలవంతంగా హైదరాబాద్‌లో చదవాలని కోరారు. దీంతో మనస్తాపం చెంది నవీన్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు తండ్రి హరికిషన్‌ ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌ వ్యాపారంలో కొంత డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోందని, విచారణ చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా, ట్రేడింగ్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి రూ.లక్షకు మూడు లక్షలు వస్తాయనే ఆశ చూపడంతో నమ్మి యువకుడు మోసపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చక్కర్లు కొడుతోంది. అయితే అవన్నీ అవాస్తమని మృతుడి సంబంధీకులు పేర్కొన్నారు.

చేనేత కార్మికుడి ఆత్మహత్య... నకిరేకల్‌: నకిరేకల్‌ తిప్పర్తిరోడ్డులోని గణేశ్‌నగర్‌లో చేనేత కార్మికుడు రాపోలు భాస్కర్‌(50) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి నల్గొండలో నేత కార్మికునిగా పనిచేస్తున్నారు. నరేకల్‌లోని పాత ఇంట్లో ఉరికి వేలాడుతున్న ఇతన్ని గమనించిన సమీప బంధువులు తమకు సమాచారం ఇచ్చారని, ఇతనికి భార్య, తల్లి ఉన్నారని సీఐ కె.నాగరాజు తెలిపారు. కుటుంబ సమస్యలే ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని భార్య రాధ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాల శవాగారానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని