పక్క తరగతి గదికి వెళ్లాడని..
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

పక్క తరగతి గదికి వెళ్లాడని..

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

కమిలిపోయిన విద్యార్థి వీపును ప్రిన్సిపల్‌ పావనికి చూపిస్తున్న కుటుంబ సభ్యులు

భువనగిరి నేరవిభాగం, భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: పక్క తరగతి గదికి వెళ్లి అల్లరి చేస్తున్నాడంటూ వీపు కమిలిపోయేలా ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన భువనగిరి పట్టణంలోని రాంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లిన బాలుడు తరగతి విరామంలో పక్క తరగతి గదికి వెళ్లాడు. ‘పక్క తరగతికి వెళ్లి అల్లరి చేస్తున్నావంటూ’ ఉపాధ్యాయుడు ప్లాస్టిక్‌ స్కేల్‌తో వీపు, తలపై కొట్టాడని విద్యార్థి వాపోయాడు. బాలుడి వీపు ఎర్రగా కమిలిపోవడంతో అతని కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపల్‌, యాజమాన్యాన్ని నిలదీశారు. ‘విద్యార్థిని ఎందుకు కొట్టారని అడిగితే.. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింద’ని, అధికారులు ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్‌చేశారు. డయల్‌ 100కు ఫోన్‌ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. బాలల పరిరక్షణ సంఘం వారు ఫిర్యాదు చేసేందుకు వచ్చారని, ఇంకా కేసు నమోదు చేయలేదని ఎస్సై వినోద్‌ తెలిపారు. ‘ఆ బాలుడికి ప్రతి సంవత్సరం ఫీజులో 30 శాతం రాయితీ ఇస్తున్నాం.. తరగతి గదిలో అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయుడు కోటేశ్వర్‌రావు మందలించాడని, కొట్టలేద’ని పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పాఠశాలను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని