ఆటంకాలు
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

ఆటంకాలు

సూర్యాపేట క్రీడావిభాగం, న్యూస్‌టుడే

నిర్వహణ లేక గడ్డితో దర్శనమిస్తున్న తుంగతుర్తి క్రీడామైదానం

మ్మడి జిల్లాలో మైదానాల కొరతతో యువత ఆటలకు దూరమవుతున్నారు. గత అయిదేళ్లుగా క్రీడలు, మైదానాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నైపుణ్యం కలిగిన క్రీడా కుసుమాలు మరుగున పడుతున్నారు. తమ ప్రతిభను నిరుపించుకోవడానికి సరైన వేదిక, ప్రోత్సాహం లేక ఇంటికే పరిమితమవుతున్నారు. నియోజకవర్గాల్లోని కొన్ని మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలు ఉన్నా వాటి నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రావడం లేదు. దీంతో అవి మందుబాబుల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని చోట్ల క్రీడా సామగ్రి పాడై తుప్పు పడుతున్నా పట్టించుకోవడం లేదు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 14.20 ఎకరాల భూమిలో రూ.1.8 కోట్లు కేటాయించి క్రీడా మైదానం, బ్యాడ్మింటన్‌ కోర్టులను ప్రభుత్వం నిర్మించింది. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా సూర్యాపేటను జిల్లాగా ప్రకటించి మినీ స్టేడియాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయానికి కేటాయించారు. మైదానం అందుబాటులోకి వచ్చిందనే సంతోషం లేకుండా పోయింది. సూర్యాపేట పట్టణ ప్రజలు, క్రీడాకారులకు క్రీడా మైదానం కలగానే మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 71 మండలాలున్నా ఉండగా 11 క్రీడా మైదానాలే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను గుర్తించి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.  ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే  కొంత మంది దాతల సహకారంతోనైనా నాయకులు, అధికారులు మైదానాల ఏర్పాటుకు పూనుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ప్రతిపాదనలు పంపాం
- బి.వెంకట్‌రెడ్డి, జిల్లా క్రీడాశాఖాధికారి, సూర్యాపేట

జిల్లాలో క్రీడా మైదానాల కొరత వాస్తవమే. క్రీడా మైదానాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. ఉన్నచోట సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఈ విషయమై గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మైదానాల నిర్వహణకు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తాం.


అందుబాటులోకి తేవాలి
- మెడిదల ఉపేందర్‌, సూర్యాపేట, క్రీడాకారుడు

సూర్యాపేటలో సరైన వసతులు లేక నాలాంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎంతో మంది మరుగున పడుతున్నారు. సూర్యాపేటలో క్రీడామైదానం ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాం. నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వినియోగించడంతో నిరాశే ఎదురైంది. జిల్లా స్థాయిలో సరైన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి క్రీడాకారులకు తోడ్పాటునందించాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని