నాడు దోచుకున్నవారే మళ్లీ వస్తున్నారు: గుత్తా
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

నాడు దోచుకున్నవారే మళ్లీ వస్తున్నారు: గుత్తా

మాట్లాడుతున్న మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను దోచుకున్నవారే తిరిగి మారు పేర్లతో మళ్లీ వస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ డీఎన్‌ఏ ఉన్న షర్మిల తెలంగాణ ఆడబిడ్డ ఎలా అవుతారని, ఆమె పాదయాత్ర ఎందుకనేది ఎవరి అంతుచిక్కడం లేదన్నారు. కుటుంబ పాలన అంటూ షర్మిల ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, షర్మిల పెత్తనంతో పాటు వనరులు దోచుకోవాలని రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. మంత్రి కిషన్‌రెడ్డి లాంటి వ్యక్తులు కూడా పచ్చి అబద్ధాలు ఆడడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేసింది అవినీతిని అంతం చేయడానికేనని గుర్తు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని జోస్యం చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచిన భాజపాకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ మిర్యాలగూడతో పాటు దేవరకొండ నియోజకవర్గాల్లో లిప్టు పనులు మంజూరు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట నిలుపుకున్నారని తెలిపారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు, తెరాస నాయకుడు పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని