పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు
eenadu telugu news
Updated : 24/10/2021 05:24 IST

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

డీఐఈవో దస్రునాయక్‌

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి ఆందోళన చెందకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలి. ప్రతి కేంద్రంలో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నాం. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంటముందే చేరుకోవాలి. పరీక్షల విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించనున్నామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారి (డీఐఈవో) దస్రునాయక్‌ తెలిపారు. ఈనెల 25 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలిలా..

పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు:  ప్రతి పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, ఫర్నిచర్‌ సౌకర్యం కల్పించాం. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది కేంద్రాల వద్ద ఉంటారు. పరీక్షలు జరిగే సమయాల్లో విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను కోరాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో సకాలంలో బస్సులు నడిచేలా ఆర్టీసీ వారికి లేఖలు పంపాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

ఒక్క నిమిషం నిబంధన అమలు: ఒక్క నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేయనున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం. విద్యార్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.విద్యార్థులు tsbie వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్షల నిర్వహణ కమిటీ ఇదే: జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలో డీఐఈవో, ఇద్దరు సినియర్‌ ప్రిన్సిపాళ్లు, ఒక జూనియర్‌ లెక్చరర్‌లను నియమించాం. మరో 58 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డీవోలు 58 మంది, కస్టోడియన్లు 8 మంది, 2 ప్లయింగ్‌ స్వ్కాడ్స్‌, 4 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఉన్నారు. వీరంతా  పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తూ పరీక్షలు పకడ్భందీగా జరిగేలా కృషి చేస్తారు.


జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలు:  జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. 119 కళాశాలలకు చెందిన 16,854 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 2,657 మంది వొకేషనల్‌ విద్యార్థులు, 14,197 మంది జనరల్‌ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 14 ప్రశ్నాపత్రాల భద్రత కేంద్రాలను ఏర్పాటు చేశాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాలను సిద్ధంగా ఉంచాం.


విద్యార్థులు ఆందోళన పడొద్దు: సిలబస్‌ 70శాతం పూర్తయింది. అందుకు సంబంధించినవే ప్రశ్నలే ఉంటాయి. అన్ని కళాశాలల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలి. విద్యార్థులు పరీక్షలు బాగా రాసేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సహించాలి.


కరోనా నిబంధనలు అమలు:   పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేయనున్నాం. కేంద్రాల్లో శానిటైజర్‌ అందుబాటులో ఉంచనున్నాం. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే విద్యార్థులను లోపలకి అనుమతిస్తాం. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్‌ ధరించి శానిటైజర్‌తో హాజరుకావాలి. విద్యార్థులు పెన్సిల్‌, పెన్నులు మార్చుకోకుండా జాగ్రత్తలు వహించాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని