20 ఏళ్ల యాదిలో.. చరిత ఘనం.. భవిత బలం
eenadu telugu news
Updated : 26/10/2021 05:43 IST

20 ఏళ్ల యాదిలో.. చరిత ఘనం.. భవిత బలం

  -ఈనాడు, హైదరాబాద్‌

రెండు దశాబ్దాల పయనం.. ఉద్యమ పథాన చెయ్యెత్తి జైకొట్టి నినదించిన లక్షలాది నోళ్లు.. లాఠీలకు వెరవక, నిర్బంధాలకు బెదరక.. ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన అమరుల త్యాగాలను యాది చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్రాత్మక ఘట్టాలను ప్రదర్శనలో తిలకించి ఉప్పొంగి పోయారు. బంగారు తెలంగాణ సాధన దిశగా పార్టీ సాగిస్తున్న మహా ప్రస్థానాన్ని, భవిష్యత్తు లక్ష్యాలను గమనంలోకి తెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ సర్వ ప్రతినిధుల మహా సభకు సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణం వేదికైంది.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ సమావేశ మందిరంలో ఆసీనులైన తెరాస ప్లీనరీ ఆహ్వానితులు

ఫొటో ప్రదర్శన అదుర్స్‌
‘కాన్సెప్ట్‌ ఆర్ట్‌ అండ్‌ ఫొటో ఎగ్జిబిషన్‌’ పేరిట ప్రత్యేక ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్‌ చిన్ననాటి ఫొటోలు, తెరాస ఆవిర్భావం, తెలంగాణ కల సాకారంలో కీలక ఘట్టాలను ఆవిష్కరించారు. ప్రవేశ ద్వారం వద్ద డిజిటల్‌ కాకతీయ తోరణం ఆకర్షణగా నిలిచింది.

సెల్ఫీ పాయింట్లు కిటకిట
సభా ప్రాంగణంలో వీ లవ్‌ టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌జీ20 పేరిట ఏర్పాటు చేసిన స్వీయ చిత్రాల కేంద్రాలు కిటకిటలాడాయి. సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ప్రతినిధులు ఆసక్తి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ తోరణం, దుర్గం చెరువు థీమ్‌తో ప్రాంగణాన్ని రూపొందించారు.

వావ్‌.. ఘుమఘుమలు
చికెన్‌ బిర్యానీ, మటన్‌ కూర, నాటుకోడి పులుసు, మటన్‌ దాల్చా, బోటీఫ్రై, పాయా, తలకాయ కూర, రుమాలీ రోటీ.. ఇలా 36 వంటకాలను సిద్ధం చేయించారు. జిలేబి, డబుల్‌కా మీఠా, ఐస్‌క్రీం వడ్డించారు. మొత్తం 650 మంది వంట మాస్టర్లు, కార్మికులు పాలుపంచుకొన్నారు.

2,200 మందితో భద్రత
భద్రతా ఏర్పాట్లను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 2200 మంది సిబ్బందిని రంగంలోకి దించారు.  ఆరుగురు డీసీపీలు, 26 మంది ఏసీపీలు, 70 మంది సీఐలు, 192 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని