అక్రమ కేసులు బనాయిస్తే సహించం: ఎంపీ ఉత్తమ్‌
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

అక్రమ కేసులు బనాయిస్తే సహించం: ఎంపీ ఉత్తమ్‌


కోదాడలో మాట్లాడుతున్న నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే:  నియోజకవర్గంలో మా హాయంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, గత మూడేళ్ల నుంచి ఒక పని కూడా జరగలేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో డేగబాబు పంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో  విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, లిఫ్టు ఇరిగేషన్లు, రహదారుల నిర్మాణం, దేవాలయాలు ఇలా ప్రతి నిర్మాణం మేమే చేశామన్నారు. కొంతమంది పోలీసు అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ఇరవై ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక్క అవినీతి పని చేయలేదని, ప్రస్తుతం ఎమ్మెల్యే మూడేళ్లలో ప్రతి పనిలో కమీషన్‌ తీసుకుంటూ, వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. మునగాల మండలంలోని రెవెన్యూ ఇరిగేషన్‌, పోలీసు వ్యవస్థ ఎమ్మెల్యే కనుసన్నలో మెలుగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో 50వేల మోజార్టీతో నియోజకవర్గంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశ సరిహద్దులో పని చేశానని, ఇక్కడ అధికార నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఇవే మల్లయ్యయాదవ్‌కు చివరి ఎన్నికలు జీవితంలో మళ్లీ గెలవలేడని విమర్శించారు. అంతకుముందు మాజీ మంత్రి రాంరెడ్డి దామెదర్‌రెడ్డి మట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్‌పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ, మాట్లాడే విధానం నేర్చుకోవాలని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి మాట్లాడుతూ మా ఊపిరి ఉన్నంత వరకు కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకర్గ ప్రజలకు సేవ చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, టీపీసీసీ కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, మునగాల ఎంపీపీ ఎలక బిందు, నాయకులు డేగ కొండయ్య, శ్రీధర్‌, గాలి శ్రీనివాస్‌నాయుడు పాల్గొన్నారు.

సభకు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్‌ శ్రేణులు

పోలీసులను అడ్డుపెట్టుకొని భయపెడుతున్నారు
హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజూర్‌నగర్‌ సబ్‌-జైలులో ఉన్న మునగాల ఎంపీపీ ఎలక బిందు భర్త నరేందర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు పోలీసు వ్యవస్థను ఉపయోగించి సమాజాన్ని భయపెడుతున్నారన్నారు. నరేందర్‌రెడ్డి సొంత పట్టా భూమిలో చెరువు భూమి ఉందని తప్పుడు రికార్డులు సృష్టించి ఆయనపై అక్రమకేసులు బనాయించారని అన్నారు. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ భూదందాలు చేస్తూ భయానక పరిస్థితులను కల్పిస్తున్నారని ఆరోపించారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిస్థితులను, రాష్ట్రంలో నెలకొన్న తెరాస ప్రభుత్వ అరాచకాలను దేశపెద్దల దృష్టికి తీసుకపోనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి తెరాస రాజకీయ లబ్ది పొందాలనుకోవటం అవివేకమని అన్నారు. ప్రజలు త్వరలోనే వారికి తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పారు. మునాగాల ఎంపీపీ ఎలక బిందు, పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, కోతి సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని