పోచంపల్లి అర్బన్‌ బ్యాంక్‌కు మూడు జాతీయ అవార్డులు
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

పోచంపల్లి అర్బన్‌ బ్యాంక్‌కు మూడు జాతీయ అవార్డులు

భూదాన్‌పోచంపల్లి: పురపాలిక కేంద్రంలోని పోచంపల్లి అర్బన్‌ బ్యాంక్‌ (పోచంపల్లి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌)కు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మూడు జాతీయ అవార్డులు లభించినట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ సీత దామోదర్‌ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ ప్రాంటియర్స్‌ ముంబయి ఆధ్వర్యంలో ఏటా అందించే అవార్డుల కార్యక్రమం ఈనెల 22, 23 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిందని చెప్పారు. బెస్ట్‌ క్రెడిట్‌ గ్రోత్‌, బెస్ట్‌ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్‌, బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగాల్లో అవార్డులు లభించాయన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌, నాబార్డు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ షాజీ అవార్డులు ప్రకటించారని వివరించారు.


చేపల వేటకు వెళ్లి.. విద్యుదాఘాతానికి గురై..

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లి అదే సమయంలో విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతిచెందిన ఘటన గుండ్లపహాడ్‌లో చోటు చేసుకొంది. ఇన్‌ఛార్జి ఏఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొలకట్ల వెంకన్న(42) చెరువు కింద అలుగులో కరెంటు షాక్‌ ఇచ్చి చేపల వేట సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు కాలుకు కరెంటు తీగ తగలటంతో సోమవారం విద్యుతాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ట్రాక్టర్‌పై నుంచి పడి చోదకుడి మృతి

తిప్పర్తి: డ్రైవింగ్‌ చేస్తూ ట్రాక్టర్‌ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తవిటి సత్యం (31) ఆదివారం రాత్రి మృతి చెందారు. మండలంలోని రాజుపేట పరిధిలోని ఎర్రకుంట్లగూడెం గ్రామానికి చెందిన సత్యం తన ట్రాక్టర్‌లో వడ్లు తీసుకొని తిప్పర్తిలోని రైస్‌మిల్లుకు ఆదివారం వచ్చారు. రైస్‌మిల్లులో వడ్లు దింపిన అనంతరం స్వగ్రామానికి ట్రాక్టర్‌ నడుపుకుంటూ బయలుదేరారు. గంగన్నపాలెం వద్ద గుంతలు ఉండటంతో ట్రాక్టర్‌ కుదుపునకు గురికావడంతో ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ టైర్లు మీదినుంచి వెళ్లడంతో సత్యం తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య నాగమ్మ ఉన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


కుటుంబ కలహాలతో ఒకరు బలవన్మరణం

చివ్వెంల, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం పొందిన ఘటన మండలంలోని పాచ్యానాయక్‌ తండాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై పి.విష్ణుమూర్తి వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్‌ సైదా(35) కుటుంబ కలహాలతో ఈ నెల 21న పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అక్కడ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.


రెండు వ్యాన్లు ఢీకొని డ్రైవర్‌ దుర్మరణం

చౌటుప్పల్‌గ్రామీణం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామం వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ మృతి చెందినట్టు ఎస్సై అనిల్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా నాగాలపురం మండలం బీరకుప్పం గ్రామానికి చెందిన డ్రైవర్‌ ఎస్‌.శరవణ్‌కుమార్‌(21) డీసీఎం వ్యానులో బియ్యం లోడుతో హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. సోమవారం తెల్లవారుజామున రెడ్డిబావి శివారులోకి రాగానే ముందున్న మరో డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. శరవణ్‌కుమార్‌ తన వాహనం వేగాన్ని అదుపు చేయలేక ముందున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శరవణ్‌కుమార్‌ క్యాబిన్‌లోనే మృతి చెందారు. క్యాబిన్‌ నుజ్జయి శరవణ్‌కుమార్‌ మృతదేహం ఇరుక్కుపోవడంతో దాన్ని బయటికి తీసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. క్రేన్‌ సాయంతో ప్రమాదాలకు గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని