దళితబంధు లబ్ధి పంపిణీకి సన్నాహాలు
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

దళితబంధు లబ్ధి పంపిణీకి సన్నాహాలు

పది మందికి వాహనాలు మంజూరు

తుర్కపల్లి, ఆలేరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకొన్న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో దళితబంధు వాహనాల(ఆస్తుల) పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున రూ.7.60 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. లబ్ధిదారులకు ప్రావీణ్యం ఉన్న రంగాలను దృష్టిలో పెట్టుకుని పలు యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ యువత రవాణా రంగానికి, రైతులు భూమి అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మొదటి విడతగా పది మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేయటానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో నాలుగు అశోక్‌ లేలాండ్‌ గూడ్స్‌ వాహనాలు, మూడు మహీంద్ర వాహనాలు, రెండు డోజర్లు (ట్రాక్టరు), ఒక ప్యాసింజరు ఆటో మంజూరైంది.

తర్ఫీదు ఇచ్చి.. ఖాతాలు తెరిచి
రాష్ట్రంలో ‘దళితబంధు పథకం’ వాసాలమర్రి గ్రామం నుంచే ప్రారంభిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ఆగస్టు 4న గ్రామంలో నిర్వహించిన సభలో వెల్లడించారు. ప్రకటన వెలువడిన వెంటనే ప్రభుత్వం కలెక్టర్‌ ఖాతాలో నిధులు జమ చేసింది. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న రంగాలపైన అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు తెరచి రూ.10 లక్షలు చొప్పున దళితబంధు నిధులు కలెక్టరు నిధి నుంచి జమ చేశారు. భూమి అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్న వారి భూముల్లో బోర్లు వేయటానికి భూగర్భ జల వనరులశాఖ అధికారులు నీటినిల్వలపై సర్వే చేపట్టారు. రవాణా రంగంలో అనుభవం ఉన్న పదిమంది యువకులు వాహనాలు కొనుగోలుకు ఆసక్తిచూపారు. ఈ పథకం అమలులో భాగంగా మొదటి విడతగా ట్రాలీ ఆటోలు, ట్రాక్టరు డోజర్లు, ప్యాసింజరు ఆటో అందజేయటానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ వాహనాలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ సునీత నుంచి మంగళవారం లబ్ధిదారులకు అందజేయాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడిందని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌ పేర్కొన్నారు. తేదీ ఖరారు కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు.


త్వరలో తిరుమలగిరికి సీఎం కేసీఆర్‌ రాక

తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి సీఎం కేసీఆర్‌ త్వరలో రానున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో తెరాస ప్లీనరీలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తెలిపారు. దళితబంధు పథకానికి పైలెట్‌ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసి రూ.50కోట్లను ఇప్పటికే కేటాయించారు. త్వరలో లబ్ధిదారులకు నిధులు అందించేందుకు రానున్నట్లు సీఎం తెలిపా రు. 2014, 2018 సాధారణ ఎన్నికల సమయంలో ప్రచారం నిమిత్తం తిరుమలగిరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చారు. నవంబర్‌ 4 తరువాత మళ్లీ ఇక్కడికి వస్తానని తాజాగా ఆయన ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని