సర్వేత్రా జాప్యం
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

సర్వేత్రా జాప్యం

పురపాలికల్లో నత్తనడకన గృహ, భవన నిర్మాణాల గుర్తింపు

నల్గొండలో సర్వే చేస్తున్న సిబ్బంది (పాత చిత్రం)

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు పురపాలికలకు ఆదాయం పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన గృహ, భవన నిర్మాణాల గుర్తింపు సర్వే నత్తనడకన సాగుతోంది. ఇళ్లు, వాణిజ్య భవన నిర్మాణాల సముదాయాల సమగ్ర సమాచారం భువన్‌ యాప్‌లో నిక్షిప్తపరిచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జులై 10 నుంచి పురపాలికల్లో సర్వే చేపట్టాలని కమిషనర్లకు పురపాలక శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని పురపాలికల్లో ఆరంభశూరత్వంగా సర్వే మారిపోయింది. మూడు నెలల్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఇప్పటికీ కొనసాగుతోంది.

చేతివాటానికి ఆస్కారముండదనే ఉద్దేశంతో..
భువన్‌ యాప్‌ ద్వారా భవన నిర్మాణాలను సర్వే చేసి ఆస్తి పన్ను మదింపు జరిపితే మున్సిపాలిటీలకు ఆదాయం చేకూరనుంది. అయితే చాలా పురపాలికల్లో రెవెన్యూ సిబ్బంది సర్వే చేయడానికి ఇష్టపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేతో సంబంధం లేకుండా ఆస్తి పన్ను మదిస్తే చేతివాటం ప్రదర్శనతో అక్రమార్జనకు అవకాశం ఉండటంతో ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న భవన నిర్మాణాలు
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 19 పురపాలికలున్నాయి. వీటిలో గడిచిన రెండేళ్లలో వేలాదిగా కొత్త ఇళ్లు, భవనాలు వెలుస్తున్నాయి. పాత నిర్మాణాల ఆకృతులను మార్చడంతో పాటు అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి వివరాలు పురపాలికల్లో నమోదవటం లేదు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌కు ప్రభుత్వం అవకాశమిచ్చినా ప్రజల నుంచి స్పందన కరవైంది. అందువల్ల పురపాలికలు రూ.కోట్లల్లో ఆస్తి పన్ను నష్టపోవాల్సి వస్తోంది. పట్టణాల్లో కొత్తగా నిర్మించిన గృహాలు, భవనాలను భువన్‌ యాప్‌లో నిక్షిప్తపరిచి ఆస్తి పన్ను మదింపు జరిగితే మున్సిపాలిటీలకు మరింత ఆదాయం సమకూరనుంది.


సిబ్బంది కొరతతో ఆలస్యం
-వేణుగోపాల్‌రెడ్డి, ఆర్వో, నల్గొండ మున్సిపాలిటీ

ల్గొండ మున్సిపాలిటీ రెవెన్యూ సిబ్బందిలో కొందరిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. మిగతా రెవెన్యూ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. భువన్‌ యాప్‌ సర్వేలో జాప్యం జరుగుతోంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సిబ్బందితో ఆస్తి పన్నులు వసూలు చేయడంతోపాటు భువన్‌ యాప్‌ సర్వే నిర్వహిస్తున్నాం అవసరమైతే ప్రైవేట్‌ సిబ్బందిని నియమించి త్వరలోనే సర్వే పూర్తి చేస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని