చేయూతనిస్తారా.. చెయ్యిస్తారా..?
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

చేయూతనిస్తారా.. చెయ్యిస్తారా..?

మంత్రి ప్రకటించి రెండు నెలలైనా అమల్లోకి రాని త్రిఫ్ట్‌ ఫండ్‌


మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ‘నేతన్నకు చేయూత’నిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు దాటింది. పథకాన్ని సెప్టెంబరు నుంచి అమలుచేస్తామని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమల్లోకి రాలేదు. నేతన్నకు చేయూతనిచ్చే పొదుపు పథకం (థ్రిఫ్ట్‌ ఫండ్‌) ఎప్పుడు ప్రారంభమవుతుందోనని చేనేత కార్మికులు ఎదురుచూస్తున్నారు. భూదాన్‌ పోచంపల్లిలో 2017 జూన్‌ 24న నేతన్నకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మూడేళ్ల వ్యవధితో అమలైన పథకం 2020లో ముగిసింది. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత కార్మికులు విన్నవించుకోగా ఏడాదిన్నర విరామం అనంతరం ఈ ఏడాది జూన్‌ 14న పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.

కొనసాగుతున్న పరిశీలన
నేతన్నకు చేయూత పథకం కింద లబ్ధిపొందడానికి జియో ట్యాగ్‌ చేసిన మగ్గం నేసే కార్మికుడు, అతనికి సహాయం చేసే ఇద్దరు చొప్పున చేనేత, జౌళిశాఖ అధికారులకు సెప్టెంబరులో దరఖాస్తు చేసుకున్నారు. యాదాద్రి జిల్లాలో సుమారు 10వేలు, నల్గొండ జిల్లాలో 4వేలు, సూర్యాపేట జిల్లాలో 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. చేనేత వృత్తి పనిలో ఉన్నవారిని మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అధికారులు సిఫార్సు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 1,000, నల్గొండ జిల్లాలో 750, సూర్యాపేట జిల్లాలో 40 పొదుపు ఖాతా-1లను బ్యాంకుల్లో ప్రారంభించినట్టు వెల్లడించారు. చాలా మగ్గాలకు జియోట్యాగింగ్‌ చేయకపోవడంతో అనేకమంది పథకానికి నోచుకోవడం లేదు.  

మరమగ్గాల కార్మికులకు...
నేతన్నకు చేయూత పథకాన్ని మరమగ్గాల కార్మికులకు గతంలో అమలుచేశారు. వారికి సైతం పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. యాదాద్రి జిల్లాలో 3వేలు, నల్గొండ జిల్లాలో 5,176, సూర్యాపేట జిల్లాలో 25 జియోట్యాగ్‌ చేసిన మరమగ్గాలున్నాయి. మరమగ్గం నేసే కార్మికుడితో పాటు ఒక అనుబంధ కార్మికుడికి గతంలో ఈ పథకాన్ని వర్తింపజేశారు. పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు.


‘జియోట్యాగ్‌’ మగ్గాలకు మాత్రమే..

గ్గాలకు చేనేత, జౌళిశాఖ ద్వారా ‘జియో ట్యాగ్‌’ చేశారు. ఈ మగ్గాలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తించేలా నిబంధనలు విధించారు. జియో ట్యాగ్‌ చేసిన మగ్గం నేసే కార్మికుడు, అతనికి సహాయకులు ఇద్దరు నెల పాటు కష్టపడితే వచ్చే కూలిని అంచనా వేసి నేతన్నకు చేయూత పథకంలో ఎంత పొదుపు చేయాలనేది అధికారులు నిర్ణయించారు. ఈ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7,906 మంది మగ్గం నేసే కార్మికులు, 15,812 మంది అనుబంధ పనులు చేసే కార్మికులు పథకంతో లబ్ధి పొందే అవకాశముంది. పథకం ప్రారంభించాక ప్రతినెలా 15లోపు మగ్గం నేసే కార్మికుడు రూ.1,200, రంగులు, డిజైన్లు వేసే కార్మికుడు రూ.1,000, అచ్చు అతికే, కండెలు చుట్టే కార్మికురాలు రూ.800 చొప్పున బ్యాంకు ఖాతా-1లో 36 నెలల పాటు పొదుపు చేసుకోవాలి. ప్రభుత్వం దీనికి రెట్టింపు మొత్తాన్ని ప్రతినెలా పొదుపు ఖాతా-2లో జమచేస్తుంది. ఈ రెండు పొదుపు ఖాతాల్లోని డబ్బును 36 నెలల తర్వాత ప్రభుత్వ అనుమతితో ఖాతాదారులకు తిరిగిస్తారు.  


పొదుపు ఖాతాలు తెరిపిస్తున్నాం
-సోమిడి ద్వారక్‌, ఏడీ, చేనేత, జౌళిశాఖ, నల్గొండ

నేతన్నకు చేయూత పథకంలో భాగంగా అందిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. జియోట్యాగ్‌ చేసిన మగ్గం నేసే కార్మికుడికి, అనుబంధ పనులు చేసే ఇద్దరు చేనేత వృత్తిదారులకు పథకం వర్తిస్తుంది. వారు ఈ వృత్తిలో ఉన్నారా లేరా అని ధ్రువీకరించిన తర్వాత ప్రభుత్వ ఆమోదంతో పొదుపు ఖాతాలు తెరిపిస్తున్నాం.  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఖాతా-2లో జమచేయడానికి రూ.52లక్షలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని