close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

తాజా వార్తలు

కొనుగోళ్లపై నిఘా!

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహం

ఫిబ్రవరి మొదటివారం నుంచి అందుబాటులోకి..

మధ్యవర్తుల మాయాజాలం, మిల్లర్ల నిర్లక్ష్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఈనాడు, నెల్లూరు

కొనుగోళ్లపై ‘దృష్టి’ పెట్టారు.. అక్రమాలకు, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు ప్రత్యేక ‘నిఘా’ ఏర్పాటు చేశారు.. ఇప్పటికే ఆ మేరకు కసరత్తు ప్రారంభం, పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పరంగా ఈ మేరకు చర్యలు తీసుకుంటుండటం కనిపిస్తోంది.. ఫిబ్రవరి మొదటివారం నుంచీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.. లోతుగాచూస్తే, వరిసాగుకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. భారత ధాన్యాగారంగా గుర్తింపు పొందిన ఇక్కడ సుమారు 68శాతం మంది రైతులు వరిసాగుపైనే ఆధారపడ్డారంటే అతిశయోక్తి కాదు. అంతటి కీలకమైన జిల్లాలో ఏటా ధాన్యం దిగుబడి అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రధానంగా మద్దతు ధర అందకపోవడం, మధ్యవర్తులు చెప్పిందే ధర కావడంతో సమస్య నెలకొంది. ఫలితంగా రైతులు అరకొర మొత్తానికే దిగుబడి విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడేది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవీ మొక్కుబడిగా మారేవి. అరకొరగా కొనుగోలు చేసి చేతులు దులుపుకోవడంతో రైతులు చెన్నై మార్కెట్‌కు తరలించి రవాణా ఖర్చులను భరించే పరిస్థితి ఏర్పడేది. అయితే, ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ లెక్క

జిల్లాలో నాలుగేళ్ల తరవాత జలసిరి సంతరించుకుంది. దీంతో రైతులు ఆనందంగా సాగు చేపట్టారు. ఈ ఏడాది ఏకంగా 1,82,140 హెక్టార్లలో వరిసాగు జరగ్గా.. 12.82లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ కొనుగోళ్లు జరగాల్సి ఉంటుందని సూచించారు. ఈ మేరకు అన్ని డివిజన్లలో మొత్తం 165 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 103 చోట్ల పీఏసీఎస్‌లకు, 50చోట్ల వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం సభ్యులకు అవకాశం కల్పించారు. మిగిలిన 12చోట్ల డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా చేపట్టాలన్నది లక్ష్యం. ఈ మేరకు కేంద్రాల వారీగా ఎవరు కొనుగోలు చేయాలన్నదీ నిర్ణయించారు. మరో పక్షం రోజుల్లో జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లనూ అధికారులు చేస్తున్నారు.

పరికరాల కొనుగోలు

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకూ సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానంగా తేమశాతం గుర్తింపులో ఇబ్బంది లేకుండా మాయిశ్చర్‌ మీటర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. తూనికల యంత్రాలు, టార్పాలిన్‌ పట్టలను మార్కెటింగ్‌శాఖ సిద్ధం చేస్తోంది. టార్పాలిన్‌ పట్టలు, చిన్న పరికరాల కొనుగోలుకు తాజాగా టెండరు పిలిచినట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఆన్‌లైన్‌ నమోదు, కొనుగోళ్ల వివరాలు పొందుపరిచేందుకు అవసరమైన కంప్యూటర్‌, ప్రింటర్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయాలను ప్రతి కేంద్రంలోనూ డీఆర్డీఏ, డీసీఎంఎస్‌, డీసీఓ వర్గాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కేంద్రాలకు భవనాలు ఇప్పటికే గుర్తించగా.. మిల్లులకు సరకు నేరుగా పంపేలా వ్యూహం సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులు, వర్షం నేపథ్యంలో ధాన్యాన్ని కాపాడటానికి వీలుగా కవర్‌ అండ్‌ ప్లింట్‌ విధానం (క్యాప్‌ స్టోరేజీ) కోసం పట్టలను వినియోగించనున్నారు. ట్రక్‌షీట్‌ ఇచ్చిన తరవాత 24 గంటల్లో మిల్లుకు ధాన్యం వెళుతుంది. అక్కడ మిల్లర్లు డిజిటల్‌ కీ ద్వారా అక్‌నాలెడ్జి అయిన తరవాత ప్రీ ఆడిట్‌ అయి, డీఎం లాగిన్‌లో అప్రూవ్‌ అయి ఉన్నతస్థాయికి వెళ్లి ఆర్టీజీఎస్‌ ద్వారా రైతులకు నగదు చేరేలా విధానం రూపొందించారు.

ప్రత్యేక బృందాలు

ఇక, కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావులేకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందుకోసం రెండు ఫ్లయింగ్‌స్వ్కాడ్‌ బృందాలను రూపొందించారు. ఇవి వ్యవసాయశాఖ నుంచి ఒక బృందం, పౌరసరఫరాలసంస్థ నుంచి ఒక బృందం ఫ్లయింగ్‌స్క్వాడ్‌ కింద పనిచేస్తుంది. ధాన్యంలో తేమశాతంపై మిల్లరు అభ్యంతరం తెలిపినా, కొనుగోలుకు కేంద్రాల్లో ధాన్యం పరంగా విముఖత వ్యక్తం చేసినా సదరు బృందాలు వెంటనే అక్కడకు చేరుకుంటాయి. యంత్రాలు, పరికరాలను ఉపయోగించి సాంకేతికంగా మరోసారి పరిశీలన చేస్తారు. ఆ మేరకు కొనుగోళ్లు జరుపుతారు. ఒకవేళ మిల్లర్లు గోనెసంచులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా.. ధాన్యం గ్రేడింగ్‌లో ఇష్టానుసారంగా వ్యవహరించినా ఈ బృందాలు కట్టడి చేస్తాయి. వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తాయి. ఇప్పటికే గ్రేడ్‌ ఏ రకం రూ.1835, సాధారణ రకం రూ.1815గా క్వింటాలుకు మద్దతు ధర నిర్ణయించిన నేపథ్యంలో దీని అమలునూ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఆ మేరకు జిల్లా ఉన్నతాధికారులు డివిజన్ల వారీగానూ మిల్లర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం కావలిలో సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తంగా ధాన్యం కొనుగోళ్లపై అధికారులు పక్కా ప్రణాళికతో అడుగేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇందులో ఏ మేరకు అమలు జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ విషయమై పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌తో ‘ఈనాడు’ మాట్లాడగా.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈసారి అన్నీ ముందుగానే ప్లాన్‌ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచే కొనుగోళ్లకు దిగనున్నామన్న ఆమె.. నిబంధనల మేరకు జరిగేలా అన్ని స్థాయుల్లో కృషి చేస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.