ఆర్‌బీకేల ద్వారా రైతులకు సేవలు
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ఆర్‌బీకేల ద్వారా రైతులకు సేవలు


మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు సమస్యలు ఎదురైతే 1077 టోల్‌ఫ్రీ నంబరుకు డయల్‌ చేసి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ, మండల స్థాయిలో జరిగిన సమావేశాల తీర్మానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన పరికరాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు, నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సుమారు 45వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, ఇంకో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో 1010 రకం ధాన్యానికి బదులుగా.. రైతులు తమకు లాభసాటిగా ఉన్న పంటలు వేసుకోవాలని సూచించారు. 1010 రకానికి మార్కెట్‌ లేదనే విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. ఈ- క్రాప్‌, ఉద్యానవన అభివృద్ధి, రాయితీ పరికరాలు తదితర అంశాలపై చర్చించారు. రైతుల నుంచి వచ్చిన ప్రతి స్పందనను పరిగణనలోకి తీసుకుని.. వారి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో జేసీ హరేంధిరప్రసాద్‌, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు ప్రదీప్‌కుమార్‌, ఆత్మ పీడీ సత్యవతి, పశుసంవర్ధకశాఖ జేడీ మహేశ్వరుడు, పౌరసరఫరాలశాఖ డీఎం పద్మ, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని