కేంద్రం నిధులిస్తే.. జగన్‌ పేరా!
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

కేంద్రం నిధులిస్తే.. జగన్‌ పేరా!

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు


వేదికపై సోము వీర్రాజు ఇతర నాయకులు

వెంకటగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ అభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులిస్తే.. ఆ పనులకు ముఖ్యమంత్రి జగన్‌ పేరు పెట్టడం దౌర్భాగ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మోదీ దేశ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుంటే... ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. వెంకటగిరిలో గురువారం నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ భాజపా జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో వీర్రాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే సొమ్ముతో పక్కా ఇళ్లు నిర్మించి.. వాటికి ‘జగనన్న సొంతింటి కల’ అని పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ. 11 వేల కోట్ల కేంద్రం నిధులతో రాష్ట్రంలో ఆర్బీకే, ఆరోగ్య క్లినిక్‌ వంటి నిర్మాణాలు చేస్తూ.. అక్కడా జగనన్న క్లినిక్‌లు అని పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. రూ. 50వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో మాత్రం రూ.రెండు వేల కోట్లతో రోడ్డు పనులు చేయాలంటే గుత్తేదారులు ముందుకు రాక కార్యాచరణ కొరవడిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులకు సార్థకత తేవాలని ఉద్బోధించారు. ఆలయాల అంశంలో మతతత్వ పోకడలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భాజపా ఓబీసీ విభాగం అధ్యక్షుడు వెంకట శివనారాయణ మాట్లాడారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బీడీ బాలాజీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా భాజపా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకరరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అల్లం చంద్రమోహన్‌రావు, వెంకటగిరి, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయి బాధ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు, కోలా ఆనంద్‌కుమార్‌, స్థానిక నాయకులు శ్రావణ్‌, దామా గురుప్రసాద్‌ నాయుడు, వడ్లమూడి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని