అన్నదాతకు అండగా తెదేపా పోరు
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

అన్నదాతకు అండగా తెదేపా పోరు

జిల్లా వ్యాప్తంగా నిరసనలు


గూడూరులో శ్రేణులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: విత్తు మొదలు.. పండించిన దిగుబడులు అమ్ముకునే వరకు దోపిడీకి గురవుతున్న అన్నదాతలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ బుధవారం ఆందోళన చేపట్టింది. అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేసింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. నెల్లూరు గ్రామీణ మండల పరిధిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి సారంగి గున్నయ్య తదితరులు నాగలి, ధాన్యంతో నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని నినాదాలు చేశారు. కావలి పట్టణంలో తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు బొట్లగుంట శ్రీహరినాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు నిరసనలో పాల్గొన్నారు. తహసీల్దారు కార్యాలయం ముందు ధాన్యం, కూరగాయలు కుప్పగా పోసి.. ఆందోళన నిర్వహించారు. మనుబోలులో సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండిపై ప్రదర్శనగా తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేశారు. సూళ్లూరుపేటలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్‌, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఆత్మకూరులో నాయకులు పెంచలరావు, రమణారెడ్డి తదితరులు పురపాలక బస్టాండ్‌ నుంచి తహీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన జరిపారు. గూడూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వరి కంకులు, కూరగాయలు, చేపలు తదితరాలు పట్టుకుని తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఉదయగిరిలో జడ్పీ మాజీ ఛైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో బస్టాండ్‌ కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటగిరి, నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లోనూ తెదేపా శ్రేణులు ఆందోళన చేశారు.


విడవలూరులో ర్యాలీలో పాల్గొన్న పోలంరెడ్డి, కోటంరెడ్డి తదితరులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని