ప్రగతికి దారి
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ప్రగతికి దారి

రూ.6 వేల కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు


బైపాస్‌లోని గొలగమూడి కూడలి

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో మరింత ప్రగతికి కేంద్రం చర్యలు చేపట్టింది. కీలక రహదారులను జాతీయ రహదారుల జాబితాలో చేర్చడంతో పాటు వాటి అభివృద్ధి, విస్తరణకు నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని పనులు జరుగుతుండగా- త్వరలో మరికొన్ని మొదలు కానున్నాయి. తద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు పోర్టుకు ఇతర ప్రాంతాల అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనతో తీర ప్రాంతం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. 

ఈనాడు డిజిటల్, నెల్లూరు, గ్రామీణం, న్యూస్‌టుడే భారత రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. 2017లోనే మొదలు కావాల్సిన వివిధ ప్రాజెక్టులు... పలు కారణాలతో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కేంద్రం వాటిపై దృష్టి పెట్టింది. దీంతో అంచనాలు, భూసేకరణ, డీపీఆర్‌ తయారీలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వే లైన్‌ ఏర్పాటుతో ఆంధ్ర- తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు పోర్టు నుంచి సరకులు సులువుగా చేరవేసే అవకాశం ఏర్పడింది. ఈ స్థితిలోనే భారత్‌మాల పరియోజన కింద ప్రతిపాదించిన రోడ్లన్నీ నాలుగు, ఆరు లైన్లుగా విస్తరించేందుకు మార్గం సుగమం కావడంతో సరకు రవాణా మరింత సులువు కానుంది. నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో సుమారు రూ. 3వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు డీపీఆర్‌ దశలో ఉండగా- మరో రూ. 3వేల కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా.. ఎక్కువ శాతం గ్రీన్‌ఫీల్డ్‌గానే నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌మాల, సాగరమాల ప్రాజెక్టుల్లో కొంత కదలిక రాగా.. మిగిలిన ప్రతిపాదనలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పోర్టు కనెక్టివిటీ పెంచడంతో పాటు నెల్లూరు నగరంపై వాహన రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రూ. 3వేల కోట్లతో బద్వేలు- నెల్లూరు రహదారి
కడప నుంచి పోర్టుకు వెళ్లే భారీ వాహనాల రద్దీ నెల్లూరు నగరంపై పడకుండా చూసేందుకు.. బద్వేలు నుంచి నెల్లూరు వరకు వాణిజ్య నడవా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న రహదారికి సమాంతరంగా ఉంటుంది. మొత్తం రూ. 3వేల కోట్లతో 107 కి.మీ. మేర నిర్మించే ఈ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండటం.. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన రహదారి పనులు ప్రారంభమైతే.. ప్రస్తుతం ఉన్న రోడ్డు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్‌హెచ్‌ఐఏ తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. బద్వేలు సమీపంలో కేవలం 2 కి.మీ. జనావాసంలో భూమి సేకరించాల్సి ఉందని, మిగతా ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా రానుందని చెబుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే పోర్టుకు వెళ్లే వాహనాలకు దూరం కూడా బాగా తగ్గుతుంది. 

* నెల్లూరు నగరంలోని ముత్తుకూరు కూడలి నుంచి కృష్ణపట్నం రేవు వరకు 18 కి.మీ. రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ఇటీవలే ఆమోదం లభించింది. దీని వ్యయం రూ. 254 కోట్లు. డీపీఆర్‌ తయారీ కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. 

* వెంకటాచలం సమీపంలో కోల్‌కత- చెన్నై ప్రధాన రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు రహదారి విస్తరణ ఇప్పటికే ప్రారంభమైంది. 2018 నాటికి ముందే ఈ రోడ్డు ఉండగా.. విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రూ. 300 కోట్ల అంచనా వ్యయం కాగా.. పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. 


ముత్తుకూరు రోడ్డు 

ప్రాజెక్టుల తీరిది...
* నెల్లూరు బైపాస్‌లోని మూడు ప్రధాన కూడళ్లలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఆ క్రమంలోనే చింతారెడ్డిపాళెం కూడలి వద్ద రూ. 36 కోట్లతో అండర్‌ పాస్, గొలగమూడి కూడలిలో రూ. 54 కోట్లు, బుజబుజ నెల్లూరు కూడలి వద్ద రూ. 47 కోట్లతో పై వంతెన నిర్మాణానికి ఆమోదం లభించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

* ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు సమీపంలో రాకపోకలు చేసే ప్రయాణికులపై ఆంక్షలు ఉంటున్నాయి. స్థానికులు మినహా.. మిగలినవారు అటువైపు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు వాహనాల రాకపోకలు సులువుగా ఉండేందుకు ముత్తుకూరు నుంచి తమ్మినపట్నం(సౌత్‌గేటు) వరకు సుమారు 14 కి.మీ. మేర పారిశ్రామిక నడవాను నిర్మించనున్నారు. దీనికి రూ. 580 కోట్ల వ్యయం అంచనా వేశారు. 

* చిల్లకూరు క్రాస్‌రోడ్డు- తూర్పు కనుపూరు నాలుగు లైన్ల, తూర్పు కనుపూరు- పోర్టు దక్షిణ గేటు వరకు ఆరు లైన్ల రహదారిని 36 కి.మీ. విస్తరించేందుకు సుమారు రూ. 900 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు వరకు సాగరమాలలో భాగంగా 35 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ. 1300 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొన్నారు. వీటికి డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని