బైకుల దొంగ అరెస్టు.. ఎనిమిది స్వాధీనం
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

బైకుల దొంగ అరెస్టు.. ఎనిమిది స్వాధీనం


స్వాధీనం చేసుకున్న బైక్‌లను పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

ఉదయగిరి, న్యూస్‌టుడే : పలు ప్రాంతాల్లో చోరీకి గురైన ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకొని నిందితుడైన బాలుడ్ని అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం రాత్రి సీఐ వి.గిరిబాబు, ఎస్సై లతీఫున్నీసాతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఇందులో మాట్లాడుతూ ఉదయగిరిలోని మట్ల నరసింహా కాంప్లెక్స్‌లో ఈనెల అయిదో తేదీ ఓ బైకు చోరీకి గురవగా యజమాని రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఇందులో భాగంగా ఉదయగిరిలోని చైతన్య ఐటీఐ కళాశాలలో చదివే బాలుడిని గుర్తించి విచారించడంతో చోరీ జరిగిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాలుడితో కలసి ఆత్మకూరుకు చెందిన కిశోర్‌ చోరీ చేస్తున్నట్లు తేలిందన్నారు. వీరిద్దరు నెల్లూరులో ఒకటి, చెన్నైలో ఆరు చోరీ చేశారని తెలిపారు. కిశోర్‌తో పరిచయమై చోరీలు చేసినట్లు బాలుడు చెప్పాడన్నారు. కిశోర్‌ను అదుపులోకి తీసుకుంటే బైక్‌లు ఎక్కడెక్కడ చోరీ చేశారో తెలుస్తుందని బాలుడు తెలిపినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న కిశోర్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని