చీటింగ్‌ కేసు నమోదు
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

చీటింగ్‌ కేసు నమోదు

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ప్రజలను నమ్మించి చీటీలు వేసి తిరిగి నగదు చెల్లించకుండా పరారైన నిందితులపై గురువారం బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కిసాన్‌ నగర్‌కు చెందిన ఎన్‌.మల్లికార్జునరావు మామ పాపయ్య 25 ఏళ్లుగా స్థానికంగా చీటీపాటలు నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినవారు ఆయన వద్ద చీటీలు వేశారు. పాపయ్య రెండేళ్ల కిందట మృతిచెందడంతో మల్లికార్జునరావు, ఆయన భార్య చీటీలు వేస్తున్నారు. దాదాపు 200 మందికిపైగా వారి వద్ద చీటీలు వేశారు. ఈ ఏడాది మే నెల నుంచి కరోనా సాకు చూపి వారు చీటీపాటలు పెట్టడం మానివేశారు. దాంతో పలువురు వారిని పాట పెట్టాలని కోరగా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ నెల 26వతేదీ అర్ధరాత్రి మల్లికార్జున తానుంటున్న ప్లాటును ఖాళీ చేసి తన కుటుంబంతో కలిసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 10న బాధితులు పాపయ్య భార్యను కలిసి మల్లికార్జున గురించి ఆరా తీయగా, ఆమె తనకు తెలియదని చెప్పారు. దాంతో బాధితులు ఇటీవల ఎస్పీని కలిసి సమస్య వివరించారు. పలువురి నుంచి రూ.1,74,71,761 నగదు కట్టించుకుని పరారైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన బాలాజీనగర్‌ పోలీసులు చీటీలు వేసిన మల్లికార్జున భార్యపై చీటింగ్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని