దేవాదాయ శాఖకు మస్కా
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

దేవాదాయ శాఖకు మస్కా


దేవాదాయశాఖ భూమిలో మట్టి తవ్వకాలు

సంగం, న్యూస్‌టుడే : బుచ్చిరెడ్డిపాళెం కేంద్రంగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా దేవాదాయశాఖకూ మస్కా కొట్టింది. అక్రమంగా రూ. లక్షలు జేబుల్లో వేసుకుంది. సిద్దీపురం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం అనసూయనగర్‌లో నెల్లూరు గ్రామీణ మండలం కొండ్లపూడిలోని కోదండ రామస్వామి ఆలయానికి చెందిన ఎనిమిది ఎకరాల మాగాణి ఉంది. అందులో ఒక ఎకరం భూమిలో పెద్ద మట్టి దిబ్బ ఉంది. దాన్ని తొలగించి చదును చేస్తే.. వ్యవసాయ యోగ్యంగా మారుతుంది. మట్టి మాఫియాలో ‘నరసింహావతారంగా’ పేరొందిన వ్యక్తి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. రైతులతో మాట్లాడారు. ఉచితంగా మట్టి దిబ్బను తొలగిస్తామని, పొలం బాగుపడుతుందని చెప్పారు. విషయాన్ని రైతుల ద్వారానే దేవాదాయశాఖ అధికారులకు తెలిపారు. వారు కూడా తమ ఆలయానికి రాబడి పెరుగుతుందనే యోచనతో అందుకు ఆమోదం తెలిపారు.

ట్రక్కు రూ.1500 చొప్పున

అక్కడి నుంచి అంగీకారం లభించిన వెంటనే సూత్రధారి తన దందాకు శ్రీకారం చుట్టారు. జేసీబీ, ట్రాక్టర్లను మాట్లాడుకున్నారు. మట్టిని తవ్వి ట్రాక్టర్‌ ట్రక్కుకు నింపితే జేసీబీకి రూ. 150, అక్కడి నుంచి మట్టిని బుచ్చిరెడ్డిపాళేనికి తరలిస్తే.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 500 చొప్పున కిరాయి చెల్లించారు. మొత్తంగా రూ. 650కి తనకు లభించిన ట్రక్కు మట్టిని ఇటుక బట్టీల యజమానులకు రూ. 1500 చొప్పున విక్రయించారు. తద్వారా ఒక్కో ట్రక్కు మట్టి నుంచి రూ. 850 చొప్పున ఆదాయం పొందారు. ఇలా పెద్ద సంఖ్యలోనే మట్టిని విక్రయించినట్లు సమాచారం. అక్కడ మట్టి తవ్వకాలను మంగళవారం ‘న్యూస్‌టుడే’ వెలుగులోకి తీసుకురావడంతో ఈ మోసం వెల్లడైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ప్రసాద్‌ మాట్లాడుతూ... అక్కడ మట్టి తొలగించి.. సమీప పొలాలకు తరలిస్తామని రైతులు అడిగితే సమ్మతించామని, వ్యాపారం జరుగుతోందని తెలియడంతో తవ్వకాలు నిలిపివేశామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని