close

సోమవారం, మార్చి 30, 2020

తాజా వార్తలు

తెవివికి త్వరలో శాశ్వత ఉపకులపతి

 పాలకమండలి నియామకం

● రెండు మూడు వారాల్లో భర్తీకి సీఎం ఆదేశం

 

న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం

తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలో శాశ్వత ఉపకులపతిని నియమించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో వీసీల నియామకాలు, పాలకమండళ్ల భర్తీ అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు తెవివికి ముగ్గురు మాత్రమే శాశ్వత ఉపకులపతులుగా పనిచేశారు. ఆచార్య సాంబయ్య పదవీకాలం గతేడాది జులై 26తో ముగిసింది. ఆ తర్వాత ఐఏఎస్‌ అధికారి వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు తెవివి ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతివారం ఒకసారి వర్సిటీని సందర్శించారు. గత ఏడాది నవంబరులో పదవీ విరమణ తీసుకున్నారు. ఈ తర్వాత డిసెంబరు 12న మరో ఐఏఎస్‌ అధికారిణి నీతూకుమార్‌ ప్రసాద్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఆమె వర్సీటీని సందర్శించకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. తెవివి పాలన కుంటుపడుతోందని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆశలు రేకెత్తాయి.

అన్వేషణ కమిటీకి ఎంపిక బాధ్యతలు

శాశ్వత ఉపకులపతి ఎంపిక బాధ్యతలను అన్వేషణ కమిటీలకు అప్పగించారు. రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు వీసీలుగా పనిచేయడానికి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కమిటీని రెండు నెలల క్రితమే నియమించినప్పటికీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. తాజాగా సీఎం ప్రకటన రావడంతో ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. తెవివికి ఉపకులపతిగా పనిచేయడానికి జిల్లాకు చెందిన కొందరు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఐదేళ్ల నుంచి తాత్కాలిక పాలకమండళ్లే..

 

తెవివిలో ఐదేళ్ల నుంచి తాత్కాలిక పాలకమండళ్లే కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి సభ్యులు లేకపోవడంతో ముగ్గురు, నలుగురితో నడిపిస్తున్నారు. వాస్తవానికి ఇందులో 9 మంది సభ్యులు కొనసాగుతారు. ఈసీ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఈ సారి పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ ప్రక్రియను చేపట్టనుంది. ఈసీ అనుమతి లేనిదే నియామకాలు జరిగాయనే వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

గాడిన పడనున్న పాలన

తెవివికి పూర్తిస్థాయి ఈసీ, శాశ్వత ఉపకులపతి నియామకం జరిగితే పాలన గాడిలో పడుతుంది. గతేడాది వీసీగా పనిచేసిన శాశ్వత ఉపకులపతి సాంబయ్య పదవీకాలం ముగిసినప్పటి నుంచి తెవివి పాలన కుంటుపడుతూ వస్తోంది. నాలుగు నెలల పాటు ఇన్‌ఛార్జి వీసీగా విధులు నిర్వహించిన అనిల్‌కుమార్‌ కూడా నెలకు నాలుగు సార్లే వర్సీటీకి వచ్చారు. ఆ తర్వాత ఇన్‌ఛార్జి వీసీగా నియమించిన నీతూ ప్రసాద్‌ ఇప్పటి వరకు వర్సీటీకి రాలేదు. దీంతో పాలన మరింత కుంటుపడింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.