దశ తిరగాలి.. విద్యార్థి ఎదగాలి
eenadu telugu news
Published : 25/05/2021 05:17 IST

దశ తిరగాలి.. విద్యార్థి ఎదగాలి

తెవివిలో సమస్యల తిష్ఠ అధ్యాపకుల్లో వర్గపోరు
కొత్త ఉపకులపతిపై ఆశలు
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి)

రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద వర్సిటీగా పేరొంది.. తొలి న్యాక్‌ గుర్తింపు సాధించినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆశించిన అభివృద్ధికి నోచుకోలేదు. రెండేళ్లు ఇన్‌ఛార్జిల పాలనలో కొనసాగిన వర్సిటీకి శాశ్వత ఉపకులపతి రావడం ఊరటనిచ్చే పరిణామం. నానో టెక్నాలజీలో నైపుణ్యం, భౌతికశాస్త్ర పరిశోధనల్లో మంచి పట్టున్న ఆచార్య దాచేపల్లి రవీందర్‌ గుప్తా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అనుభవజ్ఞులైన ఆచార్యుల సలహాలు, పరిపాలన దక్షత కలిగిన ఉద్యోగులను జట్టుగా ఏర్పర్చుకొని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడంతో పాటు పరిశోధనల వైపు ప్రోత్సహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
ముగిసిన న్యాక్‌ గడువు
ఇన్‌ఛార్జి వీసీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి హయాంలో 2015లో తెవివి ప్రతిష్ఠాత్మక ‘న్యాక్‌’ బీ గ్రేడు గుర్తింపు సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాక్‌ అర్హత సాధించిన తొలి వర్సిటీగా పేరొందింది. అప్పటి వరకు న్యాక్‌ లేని కారణంగా రూసా నిధులకు నోచుకోని వర్సిటీకి.. గుర్తింపు ఉన్న ఐదేళ్లలోనూ నయా పైసా మంజూరు కాకపోవడం దురదృష్టకరం. గతేడాదితో న్యాక్‌ గుర్తింపు ముగిసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు మెరుగైన గ్రేడ్‌ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం లభించింది. బోధన, బోధనేతర ఉద్యోగుల్ని సమన్వయం చేసి న్యాక్‌ గుర్తింపు కోసం వెళ్లాల్సినవసరం ఉంది.
దక్షిణ ప్రాంగణాన్ని పర్యవేక్షించాలి
వర్సిటీ అనుబంధమైన భిక్కనూర్‌ దక్షిణ ప్రాంగణం ఒకప్పుడు పరిశోధనల్లో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు, అధ్యాపకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నెలలో కనీసం మూడు సార్లు వీసీ ఇక్కడ పర్యటించాల్సిన అవసరం ఉంది. అలాగే సారంగాపూర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల వసతులపై దృష్టి పెట్టాలి.
వీటిపై దృష్టి సారించాలి
ప్రధాన క్యాంపస్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌ తరగతులు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. సైన్స్‌ కళాశాల, ఆడిటోరియం, పరీక్షల విభాగ భవనం, ప్రత్యేక పోలీస్‌ విభాగ భవనం, ఉద్యోగుల క్వార్టర్స్‌ నిర్మించాల్సి ఉంది.  
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల లేనందున తెవివిలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సులు  నెలకొల్పాలి. 

ఏటా పీజీ, ఎల్‌ఎల్‌బీ.. తదితర కోర్సుల్లో పెద్ద సంఖ్యల్లో సీట్లు ఖాళీ ఉంటున్నాయి. తక్షణ ప్రవేశాలు చేపడితే వర్సిటీ ఆదాయంతో పాటు విద్యార్థులకు న్యాయం జరగనుంది.

2011లో అప్పటి వీసీ అక్బర్‌ అలీఖాన్‌ హయాంలో తొలి స్నాతకోత్సవం నిర్వహించారు. వాస్తవానికి ఏటా స్నాతకోత్సవం నిర్వహించాలి. రెండోది ఇప్పటికీ నిర్వహించలేదు. 

పరీక్షల విభాగాన్ని అడ్డాగా మార్చుకొని కొందరు దందా కొనసాగిస్తున్నారు. విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేయిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు.
బోధన.. వేదన
తెవివిలో ఆచార్యుల కొరత వేధిస్తోంది. వర్సిటీ ఏర్పడినప్పుడు 144 అధ్యాపక పోస్టులు మంజూరైనా.. ప్రస్తుతం 76 మందే ఉన్నారు. 68 ఖాళీలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం కోర్సుకు ఓ ఆచార్యుడు, ఇద్దరు సహ ఆచార్యులు, నలుగురు సహాయ ఆచార్యులు ఉండాలి. తగినంత మంది లేక ఒప్పంద, పార్ట్‌టైం అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన మ్యాథ్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, బీఈడీ, ఎంఈడీ, చరిత్ర విభాగాలకు సుమారు 50 పోస్టులు అవసరం. మొత్తం 130 ఆచార్యుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
వర్సిటీకి 18 బోధనేతర పోస్టులు మంజూరు కాగా.. కేవలం ఎనిమిది మందే రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. పొరుగు సేవల కింద 230 మంది సిబ్బంది పని చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని