పచ్చదనం పరుచుకుంటోంది
eenadu telugu news
Published : 14/10/2021 04:39 IST

పచ్చదనం పరుచుకుంటోంది

నిజామాబాద్‌ గ్రామీణంలో అత్యధిక అటవీ ప్రాంతం

● శాసనమండలి నివేదికలో వెల్లడి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఉమ్మడి జిల్లాలో పచ్చదనం పరుచుకుంటోంది. గొడ్డలివేటుకు సన్నగిల్లిన అడవి తల్లి హరితహారం పుణ్యమాని మళ్లీ విచ్చుకుంటోంది. ఈ నెల 4న శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఇచ్చిన నోట్‌లో నియోజకవర్గాల వారీగా అటవీ విస్తీర్ణం పొందుపరిచారు. నాలుగేళ్లతో పోల్చితే స్వల్పంగా పెరిగినట్లుగా నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇదీ పరిస్థితి

*● 25 ఏళ్ల క్రితంతో పోల్చితే ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

*● నాలుగేళ్ల నాటితో పోల్చితే మాత్రం కొంత మేర పెరిగింది. వాస్తవానికి ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండేది. అక్రమార్కులు కొల్లగొడుతుండటంతో తరిగిపోయింది.

*● నష్టాన్ని గ్రహించిన ప్రభుత్వం కఠిన చర్యలతో పాటు పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది.

*● 2015లో ప్రారంభించిన హరితహారం పథకం కింద ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 14 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు.

*● గతేడాది నుంచి పంచాయతీల వారీగా నర్సరీలు ఏర్పాటు చేసి గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో నాటించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

*● పచ్చదనం పెంపునకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా మొక్కల సంరక్షణలో శ్రద్ధ పెట్టకపోవడంతో ఆశించిన మేర ప్రగతి సాధించట్లేదు.

*● మొక్కలు నాటడం, సంరక్షించడం ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని అధికారులు చైతన్యపరుస్తున్నారు.

అత్యల్పం అర్బన్‌

నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మొదటి స్థానంలో నిజామాబాద్‌ గ్రామీణం ఉండగా.. రెండో స్థానంలో ఎల్లారెడ్డి నిలిచింది. తరువాతి స్థానంలో బాన్సువాడ, జుక్కల్‌, బాల్కొండ, కామారెడ్డి ఉన్నాయి. బోధన్‌లో ఆరు వేల ఎకరాల్లో అడవులున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ చిట్టచివరి స్థానంలో మిగిలిపోవటం గమనార్హం.

సంరక్షణే ప్రధానం

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ వనమేధం జరుగుతోంది. వేలాది ఎకరాల్లో అటవీ సంపదను ధ్వంసం చేస్తూ పంటల సాగు చేపడుతున్నారు. ఇందుకు కొందరు అటవీశాఖ అధికారులు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల రోజుల కిందట మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట అటవీప్రాంతంలో పెద్దఎత్తున అడవులు కొట్టివేసినట్లు తెలుస్తోంది. బాన్సువాడ, సిర్నాపల్లి, ఇందల్‌వాయి, గాంధారి, లింగంపేట మండలాల్లోనూ దట్టమైన అడవులు నరికేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని