చిట్టి గుండెకు పెద్ద కష్టం
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

చిట్టి గుండెకు పెద్ద కష్టం

శస్త్రచికిత్సకు రూ.6 లక్షలు అవసరం
న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి

తల్లిదండ్రులతో  నిహాంత్‌

పుట్టుకతోనే బాలుడి గుండెకు రంధ్రం ఉందని తెలిసి తల్లిదండ్రులు హతాశులయ్యారు. మందులతో నయమవుతుందనే ఆశతో నాలుగేళ్లుగా రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. అసలే పేదరికం, ఆపై ప్రాణాంతక జబ్బు, చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆరోగ్య శ్రీ ఉన్నా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అమలుకావడం లేదు.

ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గాల గంగాధర్‌ ఆటోడ్రైవరు. ఆయన భార్య సారిక బీడీ కార్మికురాలు. వీరికి నాలుగేళ్ల క్రితం నిహాంత్‌ జన్మించాడు. పిల్లాడికి పుట్టుకతో గుండెకు రంధ్రం ఉందని తెలియడంతో గాభరాగా హైదరాబాద్‌లో పిల్లల వైద్యుడికి చూపించారు. మందులు వాడితే నయమయ్యే అవకాశమతుందని చెప్పడంతో అప్పు చేసి ఇప్పటి వరకు రూ.4 లక్షలు ఖర్చు చేశారు. నయం కాకపోవడంతో మూడు నెలల్లో శస్త్రచికిత్స చేయాలని, రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.  ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని పేర్కొన్నారు.

నెలకు రూ.20 వేలు
నిహాంత్‌ కంట్లోంచి నీరు కారడం, తరచూ జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తుంటాయి. మందులు వాడితే కొద్దిగా నయమవుతుంది. ఇందుకు నెలకు రూ.20 వేలు అవుతోంది. కుటుంబ పోషణతోపాటు కొడుకుని కాపాడుకోవాలన్న ఆశతో గంగాధర్‌ ఏడాదిన్నర కిందట గల్ఫ్‌ వెళ్లారు. కొవిడ్‌ కారణంగా ఉపాధి లేక వట్టి చేతులతో తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆటో నడిపితే రోజూ వచ్చే రూ.300 అతని ఆదాయం. అది కుటుంబ పోషణకే సరిపోతోంది. అప్పు చేద్దామంటే ఇచ్చేవారు లేరు. నాలుగేళ్ల కొడుకును కాపాడాలని దాతలను కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని