ఇరుకిరుకు వైద్యం
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

ఇరుకిరుకు వైద్యం

జిల్లా ఆసుపత్రిలో రోగుల అగచాట్లు

మాతాశిశు కేంద్రం నిర్మాణంలో ఆలస్యం

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

జిల్లా ఆసుపత్రి ఆవరణలోనే వ్యాక్సినేషన్‌ కేంద్రం

జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు రోజురోజుకు కష్టతరంగా మారుతున్నాయి. అన్నీ ఒకే చోట అందిస్తుండటంతో భవనం ఇరుకుగా మారి రోగులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. స్థాయి మారి సౌకర్యాలు మెరుగుపడుతున్నా కొద్దిపాటి స్థలంలో సేవలు గగనమవుతున్నాయి. వంద పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తయితే జిల్లా ఆసుపత్రిలో రద్దీ తగ్గనుంది. ఆ దిశగా చర్యలు వేగిరం చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది.

సాధారణ ఓపీ నరకయాతనే
ఆసుపత్రిలో సాధారణ ఓపీ నిమిత్తం రోజుకు 900- 1100 మంది వస్తున్నారు. ఈ విభాగంలో చీటీ పొంది ఆయా విభాగాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకే ఓపీ సేవలు ఉంటుండడంతో సమస్య ఎదురవుతోంది. వరుస కట్టిన వారిలో అందరికి చీటీలు దొరక్క వెనుదిరిగాల్సి వస్తోంది. రెండున్నర గంటల్లోనే సుమారు వేయి మందికి వైద్య సేవలందించడం వైద్యులకు తలకు మించిన భారంగా మారింది.

గైనిక్‌ సేవలకూ తప్పని నిరీక్షణ
గర్భిణులకు వారానికి రెండు రోజులు వైద్యసేవలు అందిస్తుండటంతో కష్టతరమవుతోంది. ఉదయం వచ్చిన వారు మధ్యాహ్నం వరకు నిరీక్షిస్తున్నారు. ఆరు నెలల క్రితం గర్భిణులకు భోజనం అందిస్తామని సర్కారు ప్రకటించినా ఆ దిశగా చర్యలు లేవు. రెండు రోజుల్లో 300- 400 మంది మహిళలు పరీక్షలకు వస్తున్నారు. వీరికి బీపీ పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉన్నా హడావుడిలో నాడి పట్టేవారే కరవయ్యారు.

జిల్లా ఆసుపత్రి ఆవరణలో వాహనాల పార్కింగ్‌తో ఇక్కట్లు

వందల మందికి టీకాలు
జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిత్యం వందలాది మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. ఒక్కో రోజు 300- 500 మందికి టీకాలు ఇస్తున్నారు. అందులో వంద మంది వరకు ద్విచక్రవాహనాలపై వస్తుండటంతో ఆవరణంతా కిక్కిరిసిపోతోంది. వార్డుల వారీగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.

అందుతున్న సేవలు
మాతాశిశుసంరక్షణ కేంద్రం(ఎన్‌ఐసీయూ), కొవిడ్‌ ఐసీయూ, సాధారణ ఐసీయూ, ట్రామాకేర్‌, పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌, డయాలసిస్‌ కేంద్రం, వ్యాక్సినేషన్‌, గైనిక్‌, సాధారణ ఓపీ, ఐపీ, రక్తనిధి కేంద్రం, రక్త పరీక్షల కేంద్రం.


ఎంసీహెచ్‌ పూర్తయితే..
- అజయ్‌కుమార్‌, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి

మతాశిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.10 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వాటి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ఇది పూర్తయితే జిల్లా ఆసుపత్రిలో రద్దీ తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి చాలా ఇరుకుగా మారింది. అరకొరగా ఉన్న స్థలంలోనే 10- 13 రకాల వైద్య సేవలు అందించాల్సి వస్తోంది.

పడకలు మొత్తం 100
ఏర్పాటు చేసినవి 35
ఆవశ్యకత 80-100


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని