డిజిటల్‌ దొంగలు
eenadu telugu news
Updated : 18/10/2021 11:00 IST

డిజిటల్‌ దొంగలు

సాంకేతికతతో ఏటీఎంల నుంచి చోరీ
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

ఏటీఎం యంత్రాలను అపహరించుకెళ్లడం, ధ్వంసం చేసి డబ్బులు దోచేయడం, ఖాతాదారుల కార్డులను ఏమార్చి నగదు కాజేసిన ఘటనలు అందరికి తెలిసిందే. కానీ ఓ ముఠా మాత్రం సాంకేతికత ఆధారంగా ఏకంగా ఏటీఎం యంత్రాలను వారీ అధీనంలోకి తీసుకొని డబ్బులు దోచేస్తున్నాయి. నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ తరహా నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.

* గతంలో తమిళనాడులో ఓ ముఠా ప్రధాన బ్యాంకు ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడింది. ఏకంగా రూ.50 లక్షల వరకు కాజేశారు. ఎట్టకేలకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో కార్డులు కొనుగోలు చేసి మాస్టర్‌ కీ సాయంతో ఏటీఎంను ఆపరేటింగ్‌ చేసినట్లు బయటపడింది.

నిందితులను విచారిస్తున్న పోలీసులు

* తాజాగా సుభాష్‌నగర్‌లో ఓ ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. వారి వద్ద ఉన్న కార్డును అందులో ఉంచారు. అనంతరం మాస్టర్‌ కీ సాయంతో ఏటీఎం ముందుభాగాన్ని తెరిచి యంత్రం తాత్కాలికంగా పనిచేయకుండా నిలిపివేశారు. ఈ ఘటనను సీసీ టీవీ దృశ్యాల ద్వారా బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

* నిజామాబాద్‌ కలెక్టరేట్‌ సమీపంలోని మరో ఏటీఎంలోనూ ఇలానే చేశారు. శనివారం రాత్రి మరోసారి మోసానికి పాల్పడుతున్న సమయంలో బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఉత్తరాది ముఠాల పని..
ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు ఎత్తుకెళ్లడం వెనుక పెద్ద రాకెట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. హరియాణ, దిల్లీకి చెందిన పలువురు ముఠాలుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్‌కు వచ్చిన ముఠాలో ఎంతమంది ఉన్నారనేది తదుపరి దర్యాప్తులో తేలనుంది. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా ఉన్న ఓ లాడ్జిలో ఇద్దరు నిందితులు కొద్ది రోజులుగా బస చేస్తున్నారని, అక్కడి నుంచి నగరంలోని అన్ని ఏటీఎంల వద్ద రెక్కీ ఉంచి పథకం ప్రకారం వరుసగా మోసాలకు తెరతీసినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని