అభివృద్ధి అంతంతే
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

అభివృద్ధి అంతంతే

ఉపాధి పనుల కల్పన, ప్రసవాల్లో ముందడుగు

రాష్ట్ర సగటును అందుకోని ఉభయ జిల్లాలు

ఆర్థిక గణాంకశాఖ-21 నివేదికలో వెల్లడి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ.. జాతీయ సగటు కంటే ఎంతో మిన్నగా ఉంది. రాష్ట్ర సగటు, ఇతర జిల్లాలతో పోల్చితే ఉభయ జిల్లాలు విద్య, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి కాస్త మెరుగుపడింది. స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో పెరుగుదల నమోదైంది. విద్య, పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తే మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై ఆర్థిక గణాంక శాఖ-21 విడుదల చేసిన నివేదికలో వివిధ రంగాల్లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిస్థితిపై కథనం.


పచ్చదనం ఇంకా పెరగాలి

కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అడవుల విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. ములుగు జిల్లా 71.8 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్ర సగటు 24 శాతం కాగా.. కామారెడ్డిలో 23.7, నిజామాబాద్‌లో 20.8 శాతం మేర అడవులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


బరువు  తక్కువ

రెండు జిల్లాల్లోనూ పిల్లల బరువు తక్కువగా ఉంది. కామారెడ్డిలో 43.9 శాతం బలహీనంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. బరువు తక్కువున్న పిల్లల్లో ఆదిలాబాద్‌ ప్రథమ స్థానంలో ఉంటే కామారెడ్డి ద్వితీయ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. అభివృద్ధి సూచిలో మెరుగ్గా ఉన్న నిజామాబాద్‌లోనూ ఇలాంటివారు 38.4 శాతం ఉండటం గమనార్హం.


ఎడాపెడా ఎరువుల వినియోగం

పంట సాగులో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంది. అధికారుల సూచనలు పాటించకుండా అవసరానికి మించి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర సగటు ఎకరానికి 177 కిలోలు ఉంటే.. నిజామాబాద్‌లో అంతకంటే ఎక్కువే వాడుతున్నట్లు తేలింది. కామారెడ్డిలో కొంత తక్కువగానే ఉన్నప్పటికీ అవసరానికి మించి ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


వేగంగా పట్టణీకరణ

కొన్నేళ్లుగా పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. పట్టణాలకు వలసలు పెరిగాయి. ప్రజల్లో ఆరోగ్యం, విద్యపై అవగాహన పెరగడం.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు లేకపోవడంతో పట్టణాల్లో ఉండేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.  నిజామాబాద్‌లో నాలుగు, కామారెడ్డిలో రెండు శాతం పట్టణ జనాభా పెరిగింది.


స్థూల  ఉత్పత్తి

జిల్లాల వారీగా ఉత్పత్తవుతున్న వస్తువులు, సేవల విలువ మేరకు స్థూల ఉత్పత్తిని లెక్కిస్తారు. ఇందులో నిజామాబాద్‌ ఆరోస్థానంలో ఉండగా.. కామారెడ్డి 16వ స్థానానికే పరిమితం అయింది. గతేడాదితో పోలిస్తే ఉభయ జిల్లాలు కాస్త మెరుగుపడినట్లు గుర్తించారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు ఇంకా వృద్ధి చెందాలి.


రైతు సగటు భూమి కొంతే

రైతుల వద్ద సగటు వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది. రాష్ట్ర సగటు 2.5 ఎకరాలు కాగా.. ఉభయ జిల్లాల అన్నదాతల వద్ద 2.2 ఎకరాలు మాత్రమే ఉండటం గమనార్హం.


పారిశ్రామికంగా అట్టడుగుకు

రాష్ట్ర రాజధానికి చెంతనే ఉన్నా పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉన్నాం. సర్వే ప్రకారం మేడ్చల్‌ 3,327 పరిశ్రమలతో ప్రథమ స్థానంలో ఉండగా.. నిజామాబాద్‌లో 449, కామారెడ్డిలో 264 మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చినవి చాలా తక్కువే. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు ఉన్నా.. ఆ దిశగా అడుగులు పడటంలేదు. స్థానికంగా యువతకు అవకాశాలు లేక ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనలో ఆశించిన ప్రగతి కానరావడం లేదు.


అభివృద్ధి సూచిలో ఇలా..

జీవనోపాధి, ఆరోగ్యం, విద్య, నివాసం, బాలల హక్కుల సంరక్షణ అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన అభివృద్ధి సూచిలో కామారెడ్డి వెనుకబడి ఉంది. రాష్ట్ర సగటు 0.29 కాగా నిజామాబాద్‌ 0.30 తో మెరుగ్గా ఉంది.


ఆసక్తికర అంశాలు

* ఉపాధిహామీ పథకం పరిశీలిస్తే.. కామారెడ్డిలో కూలీలకు మెరుగైన పనిదినాలు కల్పిస్తున్నారు. 31 జిల్లాల్లో మనది మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం.

* ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 91.6 శాతం ఉంటే ప్రస్తుతం 97.2 ఉంది.

* పంట మార్పిడికి అన్నదాతలు ససేమిరా అంటున్నారు. రాష్ట్ర సగటు 0.72 శాతం ఉంటే నిజామాబాద్‌లో కేవలం 0.49 శాతమే మార్పిడికి మొగ్గుచూపుతున్నారు. కామారెడ్డిలో 0.72 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

* ఉభయ జిల్లాల్లో వరిదే పెద్దపీట. నిజామాబాద్‌లో సాగు విస్తీర్ణంలో 67.9, కామారెడ్డిలో 49.1 శాతం మంది వరి సాగు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని